నందమూరి బాలకృష్ణ మరియు దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా తొలి షెడ్యూల్ ఈరోజే పూర్తయ్యింది. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. కాగా ఈ సందర్భంగా పాజిటివ్ ఎనర్జీతో తొలి షెడ్యూల్ పూర్తి చేయటంతో పాటు ఈ సంవత్సరానికి కూడా వీడ్కోలు పలుకుతున్నట్టు అనిల్ రావిపూడి అన్నారు.
ఈ సందర్భంగా హీరో నందమూరి బాలకృష్ణకు, చిత్ర యూనిట్ కు అనిల్ కృతజ్ఞతలు తెలిపారు. డిసెంబర్ ద్వితీయార్థంలో NBK108 సినిమా యొక్క షూటింగ్ ను యాక్షన్ కొరియోగ్రాఫర్ వెంకట్ వి. నేతృత్వంలో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణతో మొదలు పెట్టారు. కాగా ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ ఓ భారీ సెట్ ను తయారు చేశారు.
శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో ఇటీవలే ‘ధమాకా’వంటి బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో జమ చేసుకున్న శ్రీలీల ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. కాగా ఆమె ఈ సినిమాలో బాలయ్య కూతురిగా నటిస్తున్నట్లు సమాచారం. అలాగే మరో యువ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కూడా ఈ చిత్రంలో నటించనున్నారు.
ప్రస్తుతం సెట్స్ పై ఉన్న బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాకి సంగీతం అందిస్తున్న ఎస్ థమన్ ఈ చిత్రానికీ స్వరాలు సమకూర్చననున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా డిసెంబర్ 31 తేదీ చిత్ర నిర్మాతల్లో ఒకరైన హరీశ్ పెద్ది పుట్టినరోజు కూడా కావడం విశేషం.
ఈ సినిమాకు సి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, తమ్మి రాజు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. నందమూరి బాలకృష్ణతో కలిసి పని చేసే అవకాశాన్ని తొలిసారి అందుకున్న అనిల్ రావిపూడి ఆయన కోసం ఒక పవర్ ఫుల్ కథన తయారు చేశారని వినికిడి.
కాగా ఈ సినిమాలో యాక్షన్, ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయని, ఫన్ ఎలిమెంట్స్ కాస్త తక్కువగా ఉంటాయని సమాచారం. దర్శకుడు అనిల్ రావిపూడి కామెడీని బాగా తెరకెక్కిస్తారనే పేరు ఉన్నప్పటికీ బాలయ్యతో ఆయన చేయబోయే సినిమా మాత్రం కాస్త సీరియస్‌గా ఉంటుందని అంటున్నారు.
నందమూరి బాలకృష్ణ రాబోయే చిత్రం ‘వీరసింహారెడ్డి’ 2023 సంక్రాంతి సందర్భంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతున్న సంగతి మనకు తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటించారు.