నందమూరి నటసింహం బాలకృష్ణ – దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. #NBK108 అనే వర్కింగ్ టైటిల్ తో బాలకృష్ణ పుట్టినరోజున ఈ ఆసక్తికరమైన సినిమాని అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా నిర్మాతలు ఎవరు అనే విషయం పై ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. దాంతో ఇదే విషయమై పలు రకాల పుకార్లు షికారు చేసాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నిర్మాతలు మరియు సంగీత దర్శకుడి వివరాలు అధికారికంగా ప్రకటించారు.
బాలయ్య – అనిల్ రావిపూడి సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న ఎస్ థమన్ సంగీతం అందించడం విశేషం. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ఒక అనౌన్స్ మెంట్ వీడియోని విడుదల చేశారు.
ఈ మేరకు’మజిలీ’ నిర్మాతలు షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో బాలకృష్ణ – అనిల్ రావిపూడి – థమన్ వంటి శక్తివంతమైన బృందం కలిసి చరిత్ర సృష్టించడం ఖాయమని పేర్కొన్నారు.తమన్ గతంలో బాలయ్య నటించిన ‘డిక్టేటర్’ సినిమాకు సంగీతం అందించారు.. ఇక గత ఏడాది బాలయ్య నటించిన ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి అద్భుతమైన పాటలు, మరియు రోమాలు నిక్కబొడుచుకొనే సంగీతం అందించి, ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అంతే కాదు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న NBK107 సినిమాకి కూడా ఆయనే సంగీతం సమకూరుస్తున్నారు.
ఇక అనిల్ రావిపూడి – తమన్ ల కాంబినేషన్లోలో సినిమా రావడం ఇదే తొలిసారి కావడం మరో విశేషం.“త్వరలో బాంబార్డింగ్…” అంటూ ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని చిత్ర బృందం ప్రకటించారు. ఇందులో బాలకృష్ణ ను ఇంతకుముందు ఎప్పుడూ చూడని పాత్రలో చూడబోతున్నట్లు తెలిపారు. ఈ అనౌన్స్మెంట్ వీడియోకి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది అనే చెప్పాలి.
మాస్ అంశాలు మరియు కామెడీ పండించడంలో దిట్ట అయిన అనిల్ రావిపూడి ఒక వైపు.. మాస్ ప్రేక్షకులను అలరించేలా డైలాగులు చెప్పడంలో .. లార్జర్ దాన్ లైఫ్ పాత్రలను తనదైన శైలిలో పోషించే బాలకృష్ణ ఒక వైపు.. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం కోసం విభిన్నమైన, అద్భుతమైన మాస్ స్క్రిప్ట్ ని సిద్ధం చేశారని తెలుస్తోంది. అంటే ప్రేక్షకులు నటసింహ బాలయ్యను సరికొత్త పాత్రలో ఆవిష్కరించనున్నారన్నమాట. ఇందులో లేటెస్ట్ సెన్సేషన్ అయిన శ్రీలీలా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇక సినిమాలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే బయటకి రానున్నాయి. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని సమాచారం. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడి సినిమాని బాలయ్య ప్రారంభించనున్నారు.