గత కొన్ని రోజులుగా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న తుది శ్వాస విడిచారు. నేడు సాయంత్రం ఆయన ఆరోగ్యం మరింతగా విషమించగా డాక్టర్లు ఎంత ప్రయత్నించినా తారకరత్న ఆరోగ్యం నయం కాకపోవడంతో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని నారాయణ హృదయాలయ ఆసుపత్రి వర్గాలు ద్వారా సమాచారం అందింది. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే నందమూరి కుటుంబ సభ్యులు హుటాహుటిన బెంగళూరు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది.
కాగా తారకరత్న అకాల మరణంతో తెలుగు సినిమా పరిశ్రమ సభ్యులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ఘన నివాళి అర్పిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన సంతాపం వ్యక్తం చేశారు.
నందమూరి తారకరామారావు గారి మనవడు నందమూరి తారకరత్న ఇటీవల నారా లోకేష్ కుప్పం నుండి చేపట్టిన యువగళం మొదటి రోజు పాదయాత్రలో స్పృహతప్పి పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే అదే సమయంలో స్థానిక ఆసుపత్రిలో ఆయనకి అత్యవసర చికిత్స అందించిన వైద్యులు గుండెనొప్పి వచ్చినట్లు తేల్చారు. అనంతరం తారకరత్నని కుటుంబ సభ్యుల సలహా మేరకు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు.
గత జనవరి 27న ఆ ఆసుపత్రిలో చేరిన తారకరత్నకు అప్పటి నుండి ఎంతో జాగ్రత్తగా పలువురు నిపుణులైన వైద్యులు మెరుగైన చికిత్సని అందిస్తున్నారు. ఆయన తిరిగి కోలుకుంటారని, తప్పకుండా మళ్ళీ ఆరోగ్యవంతులు అవుతారని అందరూ ఆశించారు. కానీ తన కుటుంబ సభ్యులతో పాటు నందమూరి అభిమానులకు తీవ్ర మనస్థాపానికి గురి చేస్తూ ఆయన మృతి చెందారు.
తారకరత్న పార్థివదేహాన్ని రేపు మోకిలలోని ఆయన నివాసానికి తరలించనున్నారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయన పార్థివదేహాన్ని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచనున్నారు.
ఈ సమయంలో అభిమానులు, ప్రేక్షకులు తారకరత్నకు నివాళులు అర్పించవచ్చు. సోమవారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నందమూరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.