నందమూరి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దివంగత నటుడు నందమూరి తారక రామారావు కూతురు కంఠమనేని ఉమా మహేశ్వరి (52) ఆత్మహత్య చేసుకున్నారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సోమవారం ఆవిడ ఉదయం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు అని తెలిసింది. సహజ మరణం కానందువల్ల మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
మానసిక ఒత్తిడితో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కారణంగానే ఆమె ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. ఉమా మహేశ్వరి మృతితో ఎన్టీఆర్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోగా ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఉమా మహేశ్వరి సీనియర్ ఎన్టీఆర్‌కు నాలుగో కూతురు. ఇటీవలే ఆమె కూతురి వివాహం ఘనంగా జరిగింది.
అయితే ఉమా మహేశ్వరి మరణం పై ఆవిడ కూతురు దీక్షిత స్పందించారు. తన తల్లి ఆత్మహత్య చేసుకోవడానికి ఆరోగ్య సమస్యలే కారణమని దీక్షిత తెలిపారు. ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లో నలుగురు ఉన్నారట. మధ్యాహ్నం 12 గంటల సమయంలో తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నారని.. అయితే భోజనం సమయం అయినా కూడా బయటకు రాకపోవడంతో ఎం జరిగిందో అని తలుపులు తెరిచే ప్రయత్నం చేశామన్నారు. లోపలి నుంచి తలుపు గెడియ పెట్టుకున్నారన్నారు. ఇదిలా ఉండగా.. తన తల్లి ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లో తన తండ్రితో పాటు.. తన భర్త కూడా ఉన్నట్లు దీక్షిత తెలిపారు.
మరోవైపు తన తల్లి ఆత్మహత్య పై దీక్షిత పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ మేరకు అవసరమైన దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఉమామహేశ్వరి మృతదేహం ఉస్మానియా ఆస్పత్రిలో ఉంది. రేపు ఉమామహేశ్వరి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉమామహేశ్వరి ఆత్మహత్యకు మానసిక ఒత్తిడి మరియు ఆరోగ్య సమస్యలే కారణమని తెలుస్తుంది. మరో వైపు ఆమె రెండు సార్లు వివాహం చేసుకున్నట్లు సమాచారం.
ముందుగా ఆమెను నరేంద్ర రాజన్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు ఎన్టీఆర్. అయితే అతగాడు ఉమా మహేశ్వరిని వేధింపులకు గురి చేయడంతో విడాకులు ఇప్పించి ఆ తర్వాత కంఠమనేని ప్రసాద్‌తో ఉమా మహేశ్వరికి రెండో వివాహం జరిపించారు ఎన్టీఆర్.
ఏదేమైనా ఉమా మహేశ్వరి మరణం అటు నందమూరి కుటుంబానికే కాకుండా తెలుగు ప్రజలకు కూడా జీర్ణించుకోలేని వార్త అనే చెప్పాలి. ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందంటే ఆవిడ ఎంతో బాధని అనుభవించి ఉంటారు అని కొందరు అంటున్నారు. అయితే ఆవిడ కుమార్తె దీక్షిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును దర్యాప్తు చేసి చర్యలు తీసుకున్న తరువాత ఏమైనా రహస్యాలు ఉంటే బయట పడతాయి. ప్రస్తుతానికి అయితే ఉమా మహేశ్వరి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.