తాజాగా నందమూరి – అక్కినేని వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా వీరసింహారెడ్డి ఫంక్షన్ లో తాను చేసిన వ్యాఖ్యల పై నందమూరి బాలకృష్ణ ఎట్టకేలకు స్పందించారు. ఈ సందర్భంగా తనకు లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావుకు గొప్ప అనుబంధం ఉందని.. ఆయనను కించపరిచే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని బాలకృష్ణ అన్నారు.
అలాగే తాను చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేయలేదని, ఎవరినీ కించపరిచేలానీ తనకు లేదని బాలయ్య అన్నారు. “నేను ఆయన్ని బాబాయి అని పిలుస్తాను. ఆయన నా పట్ల ఎంతో ఆప్యాయంగా ఉంటారు. నిజానికి ఆయన తన పిల్లల కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తారు'” అని అక్కినేని నాగేశ్వరరావు గురించి బాలకృష్ణ వ్యాఖ్యానించారు.
పొగడ్తలకు మోసపోవద్దని తాను అక్కినేని నుంచి నేర్చుకున్నానని ఆయన అన్నారు. ఎన్టీఆర్ ను కూడా కొందరు అభిమానులు ప్రేమగా ఎంటివోడు అని సంబోధిస్తుంటారని బాలయ్య వివరించారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాషను, మాండలికాన్ని ఉపయోగించి తమకు ఇష్టమైన వారిని ఆప్యాయంగా పిలుచుకుంటారని ఆయన చెప్పారు.
అదంతా ప్రేమ, ఆప్యాయత అని బాలయ్య అన్నారు. నేను కూడా అదే అర్థంలో మాట్లాడాను. అక్కినేని బాబాయిని కించపరిచే ఉద్దేశం నాకు లేదు అని అన్నారు.
దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న వివాదానికి బాలయ్య ఫుల్ స్టాప్ పెట్టారని అందరూ భావించారు. అయితే తన కుమారుల కంటే ఏఎన్నార్ కు తనపై ఎక్కువ ప్రేమ ఉందని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించడం మరో దుమారం రేపే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే బాలయ్య వ్యాఖ్యలను విమర్శిస్తూ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నించడంతో ఈ మొత్తం వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది. ఇక బాలయ్య తాజా వివరణ పై అక్కినేని నాగార్జున కానీ, ఆయన కుటుంబం కానీ ఇంకా స్పందించలేదు.