Home సినిమా వార్తలు NBK107: మైత్రీ మూవీ మేకర్స్ కు రెండు రిలీజ్ డేట్ లు ఇచ్చిన బాలయ్య

NBK107: మైత్రీ మూవీ మేకర్స్ కు రెండు రిలీజ్ డేట్ లు ఇచ్చిన బాలయ్య

Nandamuri Balakrishna Has Given Two Release Dates To Mythri Movies For NBK 107

నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి ఇంకా అధికారికంగా టైటిల్ ప్రకటించలేదు. NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ చిత్రం తాలూకు షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఇక చిత్ర నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ విడుదల తేదీలను చర్చిస్తున్నారు. మైత్రీ మూవీస్ డిసెంబర్ 23 లేదా జనవరి 1 విడుదల తేదీలను బాలకృష్ణకు సూచించింది, అయితే బాలకృష్ణ ఈ రెండు తేదీలలో ఏదీ ఓకే చేయలేదని తెలుస్తోంది.

మొదటి తేదీ అమావాస్య అని, జనవరి 1 ఆదివారం అని బాలకృష్ణ రెండిటినీ తిరస్కరించారట. ఈ సినిమాని సంక్రాంతి సందర్భంగా మాత్రమే విడుదల చేయాలని ఆయన నిర్మాతలకు చాలా స్పష్టంగా చెప్పారట. ఈ క్రమంలో బాలయ్య, నిర్మాతలకు రెండు విడుదల తేదీలను సూచించారని తెలుస్తోంది. ఆ తేదీలు ఎవనగా.. జనవరి 12 లేదా జనవరి 14 అని సమాచారం.

దీనితో పాటు, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా విడుదల తేదీ సమస్య పట్ల కూడా మైత్రీ మూవీ మేకర్స్ ఆందోళన చెందవలసి ఉంటుంది. ఎందుకంటే చిరంజీవి కూడా సంక్రాంతి రిలీజ్ డేట్ ని ఆక్రమించాలని అనుకుంటున్నారు. ఇటు బాలకృష్ణ విషయానికి వస్తే ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించటం లేదు.

ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు నిర్మాతలకు తలనొప్పిగా మారిందనే చెప్పాలి. ఒకే ప్రొడక్షన్ నుంచి వస్తున్న రెండు సినిమాలు ఒకే సీజన్ లో రిలీజ్ చేయడం అనేది అసలు సాధ్యం కాని పని. ఒకవేళ నిజంగా అలా రెండు సినిమాలు విడుదల అయితే పెట్టుబడిదారులకు ఖచ్చితంగా ఆర్థిక నష్టం వచ్చే ప్రమాదం ఎంతైనా ఉంది.

ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఓవైపు బాలయ్యను ఒప్పించి NBK107ను డిసెంబర్ లో విడుదల చేయలేక.. మరో వైపు వాల్తేరు వీరయ్య సినిమాను సంక్రాంతికి కాకుండా వేరే డేట్ కు రిలీజ్ చేద్దామని చిరంజీవినీ ఒప్పించలేక నిర్మాతలు ఇరకాటంలో పడ్డారట. ఇక ఇరు హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో తెగ సవాల్ లు జరుగుతున్నాయి. మొత్తానికి ఇద్దరి హీరోలలో ఎవరు సంక్రాంతి బరిలో దిగుతారో చూడాలి.

NBK107కి గోపీచంద్ మలినేని రచనతో పాటు దర్శకత్వం వహించగా, వాల్తేరు వీరయ్య సినిమాకు కెఎస్ రవీంద్ర దర్శకత్వం వహించారు. గమ్మత్తైన విషయం ఏమిటంటే ఈ రెండు సినిమాల్లోనూ శృతిహాసన్ ప్రధాన కధానాయిక పాత్రలో కనిపించనున్నారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version