అఖండ వంటి అద్భుత విజయం తరువాత కెరీర్ లో చక్కని దశలో ఉన్న నందమూరి బాలకృష్ణ.. ప్రస్తుతం పలు సినిమాలతో బీజీగా ఉంటూ ఉత్సాహంతో ఉన్నారు. ఆయన ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో తన తదుపరి చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ షూటింగ్ లో పాల్గొంటూనే ఆయన మరో చిత్రాన్ని కూడా ఓకే చేశారు. తన కెరీర్‌లో తొలిసారి అనిల్ రావిపూడితో కలిసి పని చేయబోతున్నారు బాలయ్య.
అనిల్ రావిపూడి, బాలకృష్ణ కలిసి ఓ సినిమా చేయనున్నట్టు చాలా కాలం క్రితమే ప్రకటించారు. అయితే అనిల్ రావిపూడి ఇటీవలే ఎఫ్3 సినిమా షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఆ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలలో పూర్తిగా నిమగ్నమై ఉండడంతో బాలయ్యతో చేసే సినిమా స్క్రిప్టు పనిని చేయలేకపోయారు.
అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఎట్టకేలకు అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారని తెలుస్తోంది. ఇక స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యాక ఇప్పుడు తదుపరి కార్యాచరణలో భాగంగా.. సినిమాలో నటించే ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణులను ఎంచుకునే పనిలో రావిపూడి ఉన్నారట. అనిల్ రావిపూడి సినిమాల్లో నటీనటులు ఎప్పుడూ తెర నిండుగా ఉంటారు. అందరినీ ఒక గూటికి చేర్చి తనదైన శైలిలో వినోదాన్ని అందిస్తుంటారు అనిల్ రావిపూడి. ఇక సాంకేతిక నిపుణుల విషయంలో కూడా అనిల్ ఎప్పుడూ చాలా ప్రత్యేకంగా ఉంటారు. అందుకే ఈసారి కూడా అన్ని విభాగాల్లో అత్యుత్తమంగా ఉండాలనే ఆయన తగు జాగర్త పడుతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ చిత్రంలో బాలయ్య పాత్ర.. ఆయన గత చిత్రాలలో పోషించిన పాత్ర కంటే చాలా భిన్నమైన పాత్రలో నటిస్తున్నారు అని కూడా వార్తలు వచ్చాయి. జైలు శిక్ష నుంచి బయటికి వచ్చిన ఒక 45 ఏళ్ల వ్యక్తి పాత్రలో ఆయన నటించనున్నారట. కాగా ఈ సినిమాలో బాలకృష్ణ కూతురు పాత్రలో హీరోయిన్ శ్రీలీలని ఎంపిక చేయడం విశేషం.
ఇక ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ బాలయ్య నుంచి అభిమానులు మరియు ప్రేక్షకులు ఆశించే హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయట. ఆ తరువాత సెకండ్ హాఫ్ అంతా అనిల్ రావిపూడి తరహా కామెడీ టోన్‌లో ఉంటుందట. వచ్చే నెలాఖరున ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.