అక్కినేని నాగ చైతన్య హిందీ పరిశ్రమలోకి అరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ హీరోగా రూపొందిన లాల్ సింగ్ చడ్ఢా చిత్రంతో తొలిసారి హిందీ చిత్రంలో కనిపించనున్నారు చైతన్య. ఈ సినిమాలో ఆయన నటించిన పాత్ర పేరు బాలరాజు.ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం ఈ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగచైతన్య ఈ సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో ఆయన నటిస్తున్న పాత్ర పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా చిత్ర బృందం చైతన్య పాత్రకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. బాలరాజు అనే పాత్రలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాలో నటించడం పట్ల చైతన్య ఆనందం వ్యక్తం చేశారు.ఈ స్క్రిప్టు తన దగ్గరకు వచ్చినప్పుడు పాత్ర పేరు బాల అని చెప్పారని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోనిబోడిపాలెం అనే గ్రామం నుంచి ఆర్మీలో చేరేందుకు వచ్చిన ఓ యువకుడుగా చేశానని చెప్తూ.. చాలా మంది పేర్లకు ముందు ఇంటి పేరుగా ఊరి పేర్లు ఉంటాయని, అలాగే బాలరాజుకు బోడిపాలెం ఇంటి పేరుగా పెట్టామని చైతన్య తెలిపారు. అంతే కాకుండా ఈ పాత్రకు ముందుగా బాలకృష్ణ, బలరాం, సహా నాలుగైదు పేర్లను పరిశీలించినట్లు కూడా ఆయన చెప్పారు. అన్ని పేర్లని పరిశీలించిన మీదట చివరకు ఆమీర్ మరియు చిత్ర బృందానికి బాలరాజు పేరు బాగా నచ్చడంతో అదే పేరును ఖాయం చేశారట. మా తాతయ్య బాలరాజు అనే చిత్రంలో నటించడం, ఆ పేరు ఈ చిత్రంలో నా పాత్రకు ఉండటం మ్యాజిక్‌లా అనిపిస్తుందని నాగ చైతన్య ఆనందం వ్యక్తం చేశారు.
ఇక సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులూ తనను తాను మర్చిపోయి ఒక కొత్త ప్రపంచాన్ని చూశానని.. ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని చెప్పిన చైతన్య, షూటింగ్ అయిపోయిందని చెప్పినప్పుడు చాలా బాధగా అనిపించిందని చెప్పడం చూస్తుంటే ఆ పాత్రను ఆయన ఎంతగా ప్రేమించారో అనేది అర్థం అవుతుంది.
అంతే కాకుండా ఈ సినిమాలో నాగచైతన్య పాత్ర కోసం అక్కినేని నాగేశ్వరరావు గారిని పోలిన హెయిర్ స్టైల్స్, మీసకట్టును రిఫరెన్స్‌గా తీసుకున్నారట. పళ్లు కాస్త ఎత్తుగా కనిపించేందుకు క్లిప్ పెట్టారు. ఇక ఈ సందర్భంగా చైతన్యతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉందని ఆమిర్ ఖాన్ అన్నారు. హిందీ వచ్చిన వటులు కూడా డైలాగులు చెప్పడంలో తడబడతారని, కానీ నాగ చైతన్య మాత్రం అశ్శకు ఇబ్బంది పడకుండా చేశారని దర్శకుడు అద్వైత్ చందన్ పొగిడారు.