మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఈ ఏడాది ఆరంభంలో రెండు భారీ హిట్ లను సాధించి సూపర్ ఫామ్ లో ఉంది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల ద్వారా చిరంజీవి, బాలకృష్ణ ఇరువురూ కూడా తమ కెరీర్ బెస్ట్ ఫిగర్స్ సాధించి బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించారు. కాగా ఈ సంక్రాంతి పోటీలో చిరంజీవి గెలిచినా అసలు విజేత మైత్రీ మూవీస్ అనే చెప్పాలి.
అయితే చిత్రమైన విషయం ఏమిటంటే పెద్ద సినిమాల వరకూ మైత్రీ వారి సక్సెస్ రేషియో చాలా అద్భుతంగా ఉంది. కానీ మీడియం బడ్జెట్ సినిమాల విషయంలో మాత్రం అలా చెప్పలేం. చిన్న సినిమాలు తీసినప్పుడు మాత్రం వారి విజయాల సంఖ్య అంతగా బాగోలేదు.
సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంటోనీ, డియర్ కామ్రేడ్, గ్యాంగ్ లీడర్, అంటే సుందరానికీ, హ్యాపీ బర్త్ డే, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, తాజాగా అమిగోస్ లాంటి మీడియం బడ్జెట్ సినిమాలు మైత్రీ బ్యానర్ లో గత కొన్నేళ్లలో విడుదలయ్యాయి. అయితే ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగా డిజాస్టర్స్ లేదా యావరేజ్ సినిమాలుగా నిలిచాయి.
కేవలం వైష్ణవ్ తేజ్ తొలి సినిమా అయిన ఉప్పెన, అలాగే సాయి ధరమ్ తేజ్ యొక్క చిత్రలహరి, నూతన దర్శకుడు రితేష్ రాణా తెరకెక్కించిన మత్తు వదలరా వంటి చిన్న సినిమాలు మాత్రమే మైత్రీ మూవీస్ బ్యానర్ లో హిట్ అయ్యాయి.
అయితే ముందుగా చెప్పుకున్నట్లు స్టార్ హీరోలతో పెద్ద సినిమాలు తీసినప్పుడు మాత్రం మైత్రీ బ్యానర్ టాలీవుడ్ ఇండస్ట్రీకి కొన్ని పెద్ద బ్లాక్ బస్టర్స్ ఇచ్చింది. శ్రీమంతుడు, జనతా గారేజ్ రంగస్థలం, పుష్ప, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్లు గా నిలిచి భారీ కలెక్షన్లు రాబట్టి ఈ నిర్మాణ సంస్థకు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని మైత్రీ మూవీ మేకర్స్ రాబోయే సినిమాల విషయంలో అయినా తమ వ్యూహాన్ని మార్చుకుంటుందో లేదో చూడాలి.