హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇటీవల విడుదలైన సీతా రామం విజయంతో తెలుగు పరిశ్రమలో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టడమే కాకుండా ఒక గొప్ప దృశ్యకావ్యంగా ప్రశంసలను అందుకుంది. ప్రస్తుతం, సీతా రామం ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
యుద్ధం రాసిన ప్రేమకథగా తెరకెక్కిన సీతా రామం చిత్రంలో మృణాల్ దుల్కర్ సల్మాన్ సరసన నటించారు. ఇద్దరూ అద్భుతంగా నటించడమే కాకుండా ప్రేమికులుగా అద్భుతమైన కెమిస్ట్రీని పండించారు. ప్రేక్షకులు వీరి జంటను చూడటం కన్నుల పండుగగా భావించి వారి పై ఎంతగానో ప్రేమను కురిపించారు. అయితే తాజాగా మృణాల్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త తెలిసింది.
వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వనీ దత్ నిర్మాణంలో, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ – దీపికా పదుకొణె హీరో హీరోయిన్లుగా ప్రాజెక్ట్ కె సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదట్లో దర్శకుడు నాగ్ అశ్విన్.. ఈ సినిమాకి దీపికా స్థానంలో ముందుగా మృణాల్ ను ఎంపిక చేసుకున్నారట.
అయితే సీతా రామం స్క్రిప్ట్ బాగా నచ్చడంతో ప్రభాస్ సినిమాను మృణాల్ తిరస్కరించారట. ప్యాన్ ఇండియా స్థాయిలో పెద్ద స్టార్ అయిన ప్రభాస్ సినిమా అని మృణాల్ కి బాగా తెలిసినప్పటికీ.. సీతా రామం సినిమా కథ మీద ఉన్న నమ్మకంతో ప్రాజెక్ట్ కే సినిమాను వదులుకున్నారట. ఈ విషయాన్ని నిర్మాత అశ్వనీదత్ ఒక ఇంటర్వ్యూలో భాగంగా తెలిపారు.
మృణాల్ ప్రాజెక్ట్ కే ని తిరస్కరించిన తర్వాత, నాగ్ అశ్విన్, ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం దీపికా పదుకొణెని ఎంచుకున్నారు. ప్రభాస్ మరియు దీపికాల జోడీ వల్ల ఈ సినిమాకి అదనపు క్రేజ్ వచ్చింది. అలాగే ఇంతటి భారీ సినిమాని వదులుకున్నా, మృణాల్ సీతా రామం వంటి క్లాసిక్ చిత్రంలో చోటు దక్కించుకున్నారు. మొత్తంగా అందరికీ మంచే జరిగింది.
ఈ విషయం తెలుసుకున్న ప్రేక్షకులు మరియు సినీ అభిమానులు.. మృణాల్ తన స్క్రిప్ట్‌లను తెలివిగా ఎంచుకున్నందుకు ఆమెను అభినందిస్తున్నారు. హీరోకు ఉన్న స్టార్‌డమ్ ఆధారంగా సినిమా చేయనందుకు ప్రేక్షకులలో ఒక వర్గం ఆమెను విపరీతంగా పొగుడుతున్నారు. సీతా రామం ఘనవిజయం తర్వాత మృణాల్‌కు తెలుగు మరియు హిందీ నుండి అనేక ఆఫర్లు వచ్చాయి. అయితే ఆమె తన తదుపరి ప్రాజెక్ట్ వివరాలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.