శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు జంటగా వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ దర్శకత్వం వహించిన చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో. ఈ చిత్రానికి జాతి రత్నాలు సినిమా దర్శకుడైన అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈ శుక్రవారం అంటే సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమాకి సంభందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా పార్క్ హయత్ హోటల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి తనదైన శైలిలో సుదీర్ఘమైన ప్రసంగం ఇచ్చారు. నేను ఈ ఫంక్షన్ కు ఎవరికోసం వచ్చానంటే.. ఏడిద నాగేశ్వరావు గారి కోసం వచ్చాను. వారు మొదలుపెట్టిన పూర్ణోదయ బ్యానర్ లో నేను మూడు సినిమాలు చేశాను. ప్రపంచంలో తెలుగు వారు గర్వించ దగిన సినిమాలు పూర్ణోదయ బ్యానర్ వారు తీశారు.
శంకరాభరణం, స్వాతిముత్యం, స్వయంకృషి లాంటి ఎన్నో మంచి సినిమాలు తీశారని చిరంజీవి అన్నారు. అలాగే తెలుగు సినిమా పరిశ్రమ ఒక గొప్ప పరిశ్రమ అని చెప్తూ.. ఇక్కడ ఉన్నందుకు ఆయన ఎంతో గర్విస్తున్నట్లుగా సెలవిచ్చారు. అలాగే తనకు చిత్రసీమతో మధ్యలో కాస్త గ్యాప్ వచ్చినా.. మళ్లీ ఇక్కడికే వచ్చానని అన్నారు. పరిశ్రమలోకి ఒక ఫైర్ తో ఒక టాలెంట్ తో వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడ నిలదొక్కుకుంటారు. అలా కాకుండా ఇండస్ట్రీకి వచ్చాం కదా ఇక అంతా అయిపోయింది అని లైట్ తీసుకొంటే మాత్రం వెనక్కి పంపించేస్తుందని చిరంజీవి అన్నారు.
ఇక సినిమా ఇండస్ట్రీ గడ్డు పరిస్థితుల్లో వుంది, ప్రేక్షకులు థియేటర్ల వద్దకు రావడం లేదు అని కొందరు అనుకుంటున్నారు. కానీ సరైన కంటెంట్ తో సినిమాలు తీస్తే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్ల వద్దకు వస్తారు. బింబిసార, సీతా రామం, కార్తికేయ 2 మంచి కంటెంట్ తో వచ్చిన సినిమాలు హిట్ అయ్యాయి అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
ఇక ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకుల పనితీరు పై కూడా చిరంజీవి వ్యాఖ్యానించారు. కేవలం హీరోల డేట్స్ ఉన్నాయి కదా అని షూటింగ్స్ చుట్టేసినట్టు సినిమాలు యేయ కూడదు. దర్శకుడు అనే వాడు కథల మీద దృష్టి పెట్టాలి అని చిరంజీవి పేర్కొన్నారు. అలాగే ఇలాంటి చిన్న సినిమాల తాలూకు ఫంక్షన్లకు వెళ్తే స్థాయి తగ్గుతుందని అనుకుంటారు కానీ నేను వాళ్లకు ఈ విధంగా సహాయ పడడం నాకు సంతోషంగా వుంటుందని చిరంజీవి చెప్పుకొచ్చారు.