తాజాగా కేరళ లోని వయనాడ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన నిజంగా అందరి మనసులు కలచివేస్తోంది. ఇప్పటికే అక్కడి ప్రాంతం, ఆ పరిస్థితులకు సంబందించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఆ దారుణ ఘటన చూసిన అనేకమంది మనసులు చలించిపోతున్నాయి.
కాగా ఆ ఘటన జరిగిన వెనువెంటనే కేరళ ప్రభుత్వం స్పందించి సహాయక చర్యలు చేపట్టగా పలువురు ప్రజలు అక్కడి వారికి తమవంతు చేయూతనిచ్చి సాయమందించేందుకు ముందుకు వస్తున్నారు.
ఇక మన టాలీవుడ్ నుండి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి రూ. 1 కోటి విరాళాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందించగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రూ. 25 లక్షలు, తమిళ స్టార్ హీరో సూర్య, కార్తీ, జ్యోతికలు కలిసి రూ. 50 లక్షలు, నయనతార విఘ్నేష్ శివన్ ల దంపతులు రూ. 20 లక్షలు, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్ కలిసి రూ. 35 లక్షలు, ఫహాద్ ఫాసిల్ రూ. 25 లక్షలు, లోకనాయకుడు కమల్ హాసన్ రూ. 25 లక్షలు, చియాన్ విక్రమ్ రూ. 20 లక్షలు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న రూ. 10 లక్షల విరాళాన్ని అందించారు. అలానే మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ స్వయంగా అక్కడి సహాయక చర్యల్లో పాల్గొనడంతో పాటు తాను వ్యవస్థాపకుడిగా ఉన్న విశ్వశాంతి ఫౌండేషన్ తరపున ఏకంగా రూ. 3 కోట్ల విరాళాన్ని అందించడం జరిగింది.