మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించగా, మరో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన లూసిఫర్ సినిమా 2019 లో విడుదలైంది. ఆ సినిమా కేరళ బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మలయాళ పరిశ్రమలో అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా నిలిచింది. ఆ తరువాత వచ్చిన ఏ మలయాళ సినిమా కూడా ఈ రికార్డును బద్దలు కొట్టే స్థాయికి చేరుకోలేకపోయింది.
లూసిఫెర్ సినిమా ముగించిన తీరును బట్టి ఖచ్చితంగా ఈ సినిమాని ఫ్రాంచైజీగా కొనసాగిస్తారని, కొద్ది రోజులు ఆగిన తరువాత సీక్వెల్ తెరక్కిస్తారని చాలా స్పష్టంగా అర్థమైంది. అప్పటి నుండి మోహన్ లాల్ అభిమానులు మరియు ఇతర సినీ ప్రేమికులు లూసిఫర్ రెండవ భాగం ఎప్పుడు మొదలవుతోందా, ఆ చిత్రానికి సంబంధించిన ఇతర అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ దశలో లూసిఫర్ చిత్రానికి సంబంధించి చిత్ర యూనిట్ కొన్ని రోజుల క్రితం అనధికారికంగా సమావేశమయ్యారని తెలుస్తోంది. ఆ సమావేశంలో ఫ్రాంచైజీకి సంబంధించిన కొన్ని అంశాలను చర్చించారట. అలాగే లూసిఫర్‌కి మూడో భాగం వచ్చే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయని సమాచారం. ఎంపురాన్ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను కూడా మోహన్‌లాల్ సన్నిహితుడైన ఆంటోని పెరుంబవూర్ నిర్మించనున్నారు. ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆయన ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
2019 లో విడుదలైన లూసిఫర్ సినిమా భారీ హిట్ అవడమే కాకుండా దర్శకుడిగా పృథ్వీరాజ్ కు చక్కని పేరును తీసుకు వచ్చింది. ఆ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో మంజు వారియర్, వివేక్ ఒబెరాయ్, టోవినో థామస్ మరియు ఇంద్రజిత్ సుకుమారన్ నటించారు. పృథ్వీరాజ్ కూడా ఒక కీలక అతిథి పాత్రలో నటించారు. ఇక సీక్వెల్ లో పృథ్వీరాజ్ పాత్ర పెరగనుందని సమాచారం. ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
కాగా, మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం లూసిఫర్ సినిమాని గాడ్‌ఫాదర్‌గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకుడు. గాడ్ ఫాదర్ సినిమా విజయం సాధిస్తే.. తెలుగులో కూడా గాడ్ ఫాదర్ సీక్వెల్ వచ్చే అవకాశం ఉంది.