మోహన్‌లాల్ అభిమానులతో పాటు ఇతర సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. వారి ఆశలు నిజమయ్యేలా, వారు ఆనందంతో పొంగిపోయే వార్త ఒకటి బయటకి వచ్చింది. దర్శకుడు జీతూ జోసెఫ్ దృశ్యం 3 ప్లాన్‌లో ఉందని, త్వరలో మరిన్ని వివరాలను ప్రకటిస్తామని ప్రకటించారు.
2013లో విడుదలైన దృశ్యం మొదటి భాగం సూపర్ హిట్ గా నిలవడంతో పాటు ఎన్నో ప్రశంసలను అందుకుని, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రీమేక్ అయి ప్రతి చోటా విజయం సాధించి ఒక అద్భుతమైన సినిమాగా నిలిచింది.
గత ఏడాది ప్రారంభంలో దృశ్యం సీక్వెల్ అయిన దృశ్యం 2 సినిమా విడుదల అయింది , కరోనా ప్యాన్డేమిక్ నేపథ్యంలో ఆ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా OTTలో ప్రదర్శించబడింది. దృశ్యం సీరీస్ అంటే కేవలం మలయాళ ప్రేక్షకులకి మాత్రమే కాదు తెలుగు, తమిళ, కన్నడ మరియు హిందీ భాషల్లో కూడా ఆ ఫ్రాంచైజీకు భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు.
తమిళ రీమేక్ అయిన ‘పాపనాశనం’లో కమల్ హాసన్ నటించగా, తెలుగులో వెంకటేష్ హీరోగా ‘దృశ్యం’ సినిమాను తీశారు. హిందీ వెర్షన్‌లో కూడా ‘దృశ్యం’ అనే పేరు తోనే అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు, ఇక కన్నడ రీమేక్ ను ‘దృశ్య’ అనే టైటిల్‌తో రవిచంద్రన్ హీరోగా చేశారు.
ఇక సీక్వెల్ విషయానికి వస్తే, తెలుగులో విక్టరీ వెంకటేష్ అదే రాంబాబు పాత్రలో సీక్వెల్ లో నటించారు. ఇక కన్నడలోను మళ్ళీ రవి చంద్రన్ హీరోగా దృశ్యా 2 లో కనిపించారు. అయితే తమిళ వెర్షన్ తెరలెక్కలేదు. పలు నటుల పేర్లు వినిపించాయి కానీ ఏదీ అధికారిక ప్రకటన రాలేదు. ఇక హిందీలో అజయ్ దేవగణ్ మళ్ళీ సీక్వెల్ లోనూ కనిపిస్తారని వార్తలు వచ్చినా, ఆ చిత్రం గురించి కూడా ఎలాంటి వార్తా బయటకి రాలేదు.
మోహన్ లాల్ కు నటుడిగా ఎంతో పేరు తెచ్చి పెట్టిన దృశ్యం చిత్రంలో మీనా, ఆశా శరత్, ఎస్తేర్ అనిల్, సిద్ధిక్ మరియు అన్సిబా హసన్ కీలక పాత్రల్లో నటించారు. దృశ్యం 3కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి. ఈ సీక్వెల్ కోసం కేవలం మోహన్ లాల్ అభిమానులు మాత్రమే కాకుండా ఇతర సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. వారికి అంతే ఉత్సాహాన్ని అందించే మరిన్ని అప్‌డేట్ లు త్వరలోనే ఉన్నాయి.