గత కొద్దిరోజుల నుండి మంచు కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయన్న వార్తలు బాగా ప్రచారంలోకి వచ్చాయి. మంచు విష్ణు తన మీద గొడవకు వచ్చిన సంఘటనను మంచు మనోజ్ వీడియో తీసి తన సోషల్ మీడియాలో ఖాతాలో పోస్ట్ చేసి మా అన్నయ్య ఇలాంటి వాడు షేర్ చేయడంతో అధి కాస్తా వైరల్ అయ్యి అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు నిజమే అని అందరూ అనుకునేలా చేసింది.
అయితే ఈ విషయంలో మోహన్ బాబు కల్పించుకొని మంచు మనోజ్ కి సర్ది చెప్పి ఆ వీడియో డిలీట్ చేయమని చెప్పారని కూడా పలు వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత మంచు విష్ణు అది ప్రాంక్ వీడియో అని, అది మా బ్యానర్ లో రాబోతున్న కొత్త రియాల్టీ షో కి సంబంధించిన ప్రాంక్ వీడియో అన్న విధంగా వివరణ ఇవడంతో అసలు మంచు విష్ణు మరియు మనోజ్ మధ్య గొడవ నిజమేనా లేక ఆ గొడవలు బయటపడడంతో కప్పిపుచ్చుకుంటున్నారా అని కొంతమంది నెటిజన్స్ సందేహం వ్యక్తం చేశారు.
అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహన్ బాబు తన కొడుకుల వివాదం పై పరోక్షంగా వివరణ ఇచ్చారు.
మోహన్ బాబు మాట్లాడుతూ.. అన్నదమ్ముల మధ్య ఉన్నవి చిన్న చిన్న గొడవలే కానీ అవి చిలికి చిలికి గాలి వానలా మారినట్టు కనిపిస్తోంది. అయితే గొడవలు పెట్టుకోవడం వల్ల ఎవరికి ఏం లాభం లేదు. మనుషులు దూరం అవుతారు. కుటుంబంలో ఉన్న ఆనందం కూడా దూరమైపోతుంది. ఇలా గొడవలు ఎందుకు జరుగుతున్నాయి అని కాస్త బాధ అవుతాను. అంతే కాదు అలాంటివి జరగకపోతే బాగుండు కదా అని కూడా అనుకుంటానని చెప్పారు.
అయితే ఇవి ఎంతకాలం సాగుతాయి అని స్పష్టంగా చెప్పలేనని.. ప్రతి ఒక్కరికి ఆవేశాలు,మనస్పర్ధలు అనేవి ఉంటాయని, కానీ ఇలాంటివి ఎందుకు వస్తాయో ఎవరు చెప్పలేం అంటూ మోహన్ బాబు మహాభారతం గురించి ప్రస్తావిస్తున్నట్టు మాట్లాడుతూనే తన ఇద్దరు కొడుకుల మధ్య గొడవ గురించి పరోక్షంగా చెప్పేశారు.
దీంతో మంచు మోహన్ బాబు తన ఇద్దరు కొడుకులు మధ్య ఉన్న విభేదాలు నిజమే అన్నట్లు వివరణ ఇచ్చినట్లు అయింది. ఇక తాను స్థాపించిన విద్యానికేతన్ యూనివర్శిటీ గురించి కూడా మోహన్ బాబు మాట్లాడారు. ఆ యూనివర్శిటీ విజయానికి ప్రధాన కారణమైన వ్యక్తి మంచు విష్ణు అని మోహన్ బాబు పేర్కొన్నారు. విష్ణు గత 12 ఏళ్లుగా యూనివర్శిటీకే తన పూర్తి సమయాన్ని వెచ్చిస్తున్నారని, కానీ మంచు మనోజ్ తనకు సినిమాల పైనే ఆసక్తి ఉందని, యూనివర్సిటీ నిర్వహణ బాధ్యతను విష్ణునే తీసుకోనివ్వమని తనతో అన్నట్లు చెప్పారు.