న్యూయార్క్ టైమ్స్ లో ప్రచురితమైన కథనాల స్ఫూర్తితో ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో ”మోడ్రన్ లవ్ హైదరాబాద్” సిరీస్ ను రూపొందించిందని తెలుస్తోంది. సుహాసిని మణిరత్నం – రేవతి – ఆది పినిశెట్టి – నిత్యా మీనన్ -రీతూ వర్మ – మాళవిక నాయర్ – అభిజిత్ దుద్దాల -రేవతి – నరేష్ – నరేష్ అగస్త్య – కోమలీ ప్రసాద్ -ఉల్కా గుప్తా తదితరులు ప్రధాన పాత్రల్లో ఈ సిరీస్ తెరకెక్కింది.ఈ వెబ్ సీరీస్ కు మొత్తం ఆరు ఎపిసోడ్ లు ఉండగా నలుగురు దర్శకులు పని చేశారు.
Episode 1 – My Unlikely Pandemic Partner.
ప్రముఖ దర్శకుడు నగేష్ కుకునూర్ తెరకెక్కించిన ఈ కథలో సీనియర్ నటి రేవతి, వర్ధమాన నటి నిత్య మీనన్ తల్లీ కూతుళ్ళుగా నటించారు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కారణంగా కూతురు ఇల్లు వదిలి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఆరేళ్ల తరువాత భర్తను పోగొట్టుకున్న తల్లి లాక్ డౌన్ సమయంలో కూతురు పంచన చేరుతుంది..ఆ సమయంలో ఇద్దరూ పరస్పరం గొడవ పడుతూనే ఎలా మళ్ళీ దగ్గరయ్యారు అనేది కథ. రేవతి, నిత్య మీనన్ ఇద్దరూ నటన పరంగా తమ పాత్రలను రక్తి కట్టించే ప్రయత్నం చేసినా కథలో, పాత్ర చిత్రణలో బలం లేకుండా పోవడం వల్ల ఏమాత్రం ప్రభావం లేకుండా పోయింది.
Episode 2 – Fuzzy, Purple and full of thorns.
ఈ కథకు కూడా నగేష్ కుకునూర్ యే దర్శకత్వం వహించారు. ఆది పినిశెట్టి, రీతు వర్మ నటించిన ఈ కథలో లివ్ ఇన్ రిలేషన్షిప్ నేపథ్యంలో కాస్త కాంటెంపరరీ గా ఉన్నా.. ఇద్దరు మధ్య సంఘర్షణకు ఎంచుకున్న కారణం చాలా సిల్లీగా ఉంటుంది. ఆది, రీతు ఇద్దరు బాగానే చేశారు, వివేక్ సాగర్ సంగీతం బాగుంది.
Episode 3 – Why did she leave me there.
ఈ కథకు కూడా నగేష్ కుకునూర్ తెరకెక్కించారు. సుహాసిని, నరేష్ అగస్త్య ముఖ్య పాత్రల్లో నటించిన ఈ కథలో భావోద్వేగాలను పండించడంలో నగేష్ సఫలం అయ్యారు. తన మంచి కోసం తనను అనాధ ఆశ్రమంలో వదిలేసి వెళ్లిన అమ్మమ్మ కి మనవడికి జరిగే ఈ కథలో ఈ మధ్య సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో ఎదుగుతున్న నటుడు నరేష్ అగస్త్య ఆకట్టుకోగా, సుహాసిని తెలంగాణ యాసలో మాట్లాడే పాత్రలో ఇట్టే ఇమిడిపోయింది.
Episode 4 – What clown wrote this script.
బిగ్ బాస్ 4 సీజన్ విజేతగా నిలిచిన అభిజీత్, మాళవిక నాయర్ జంటగా నటించిన ఈ కథను ఉదయ్ గుర్రాల తెరకెక్కించారు. స్టాండ్ అప్ కామెడీ మరియు టెలివిజన్ బ్యాక్ డ్రాప్ లో.జరిగే కథలో మాళవిక నాయర్ నటన తప్ప పెద్దగా ఆకట్టుకునే అంశాలు లేవు. కెరీర్ కి ప్రేమకి. మధ్య జరిగే సంఘర్షణ లాగా అనిపించినా అది కేవలం పై పైన టచ్ చేసినట్టు ఉందే తప్ప ఎక్కడా పాత్రలతో మనం కనెక్ట్ అయ్యే విధంగా ప్రభావితం చేయడంలో దర్శకుడు విఫలం అయ్యారు అనే చెప్పాలి.
Episode 5 – About that rustle in the bushes.
తండ్రీ కూతుళ్ళ మధ్య జరిగే ఈ కథను దేవికా బహుమానం తెరకెక్కించారు. తన కూతురు పెళ్ళి చూపులు చూసే యువకులని ఫాలో అయ్యే తండ్రి పాత్రలో నరేష్ నటన అద్భుతంగా ఉంది. అలాగే చేదు గతం నుంచి బయట పడాలని ప్రయత్నించే అమ్మాయిగా ఉల్కా గుప్తా కూడా బాగానే నటించారు. మొదట్లో గమ్మత్తుగా ఉండి నవ్వించే నరేష్ పాత్ర చివరలో గుండె బరువెక్కి ఏడ్చెలా చేస్తుంది.
Episode 6 – Finding your Penguin
C/O కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా ఈ కథకు దర్శకత్వం వహించారు. తాజాగా బ్రేకప్ జరిగి, సరైన జీవిత భాగస్వామి కోసం తపించే అమ్మాయి కథగా అసక్తికరంగానే మొదలైనా, మాటి మాటికీ వచ్చే animal planet analogy ఏమాత్రం ప్రభావం చూపకపోగా చిరాకు తెప్పిస్తుంది. అయితే ముఖ్య పాత్రలో నటించిన కోమలి ప్రసాద్, ఆమెకు స్నేహితురాలి గా నటించిన భావనా సాగి నటన పరంగా తమ ముద్రను వేశారు అని చెప్పాలి. దర్శకుడిగా వెంకటేష్ మహా మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు.
మొత్తంగా చూసుకుంటే ఈ వెబ్ సిరీస్ అభినందించదగ్గ ప్రయత్నమే అయినప్పటికీ ఆచరణ మరింత బలంగా, ప్రభావ వంతంగా ఉండాల్సింది.