మెగాస్టార్ చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ ఫిబ్రవరి 11న మళ్ళీ విడుదల కావాల్సి ఉండింది. కానీ నిర్మాతలు 4కె ఔట్ పుట్ తో సంతృప్తి చెందకపోవడంతో రీ రిలీజ్ ను వాయిదా వేశారు. కాగా త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు.
విజయ బాపినీడు దర్శకత్వంలో 1991 మే 9న విడుదలైన గ్యాంగ్ లీడర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడమే కాకుండా చిరంజీవితో పాటు ఆయన కెరీర్ లో కూడా ఓ మైలురాయి చిత్రంగా నిలిచింది. చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన ఈ చిత్రంలో మురళీ మోహన్, రావు గోపాలరావు, కైకాల, అల్లు రామలింగయ్య, నిర్మలమ్మ, ఆనందరాజ్, మాగంటి మురళీ మోహన్, శరత్ కుమార్, సుమలత, సుధ, నారాయణరావు, హరి ప్రసాద్ ఇతర పాత్రల్లో నటించారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ చేయడం ఒక ట్రెండ్ గా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని గత ఏడాది ఆగస్టు 8, 9 తేదీల్లో జరిగిన ఒక్కడు, పోకిరి సినిమాల స్పెషల్ షోలతో ఇది ప్రారంభమైంది. కాగా ఆ స్పెషల్ షోలకు విపరీతమైన స్పందన వచ్చింది.
పోకిరి, జల్సా రీరిలీజ్ లు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ల బర్త్ డే స్పెషల్స్ గా జరిగాయి. ఈ రెండూ అభిమానులకు ఒక పండగ వాతావరణంగా నిలిచాయి. అలాగే ఈ షోల ద్వారా వచ్చిన కలెక్షన్లను విరాళాల సేకరణ కోసం ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి విషయంలో కూడా అదే జరిగింది.
అయితే ఆ తర్వాత పాత సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేయడం కేవలం బిజినెస్ గా మారింది. తాజాగా తలపెట్టిన ఖుషి, ఒక్కడు, బద్రి, తొలిప్రేమ వంటి సినిమాల రీ రిలీజ్ లు కేవలం బిజినెస్ కోసమే అన్నట్టు జరిగాయి. అయితే బద్రి, తొలిప్రేమ రీ రిలీజ్ అభిమానుల నిరాసక్తత కారణంగా క్యాన్సిల్ అయ్యాయి.
ఈ స్పెషల్ షోలు ప్రేక్షకులకు ఆనాటి అనుభవాలను అందించడంతో పాటు థియేటర్లలో ఉత్సాహాన్ని కలిగిస్తాయనే విషయాన్ని పక్కన పెడితే, ఈ స్పెషల్ షోలు మరో వైపు ఆ సమయంలో విడుదలై ఉన్న ఇతర సినిమాల రన్ పై ప్రభావం చూపుతాయి. కొత్త సినిమాలకు ఆటంకం కలగకుండా, ఇబ్బంది పెట్టకుండా నిర్వాహకులు, అభిమానులు ఈ రీ రిలీజ్ లను ప్లాన్ చేసుకుంటే అందరికీ మంచిది.