ఆచార్య సినిమా విడుదలై ఆరు నెలలు కావస్తున్నా.. ఇంకా ఆ సినిమా ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఎందుకంటే వివాదాలు ఆ సినిమాని వదిలివెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు. తాజాగా తెలుగు సినీ మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు కొరటాల పై చేసిన వ్యాఖ్యల వల్ల మరోసారి ఆచార్య చిత్రం తెర పైకి వచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో ముఖ్య పాత్రలో నటించగా.. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం ఆచార్య. ఈ సినిమా కొరటాల కెరీర్ లోనే వరస్ట్ సినిమాగా నిలిచింది. చిరంజీవి పాత్ర కానీ, రామ్ చరణ్ పాత్ర కానీ ఏదీ ప్రేక్షకులని ఆకట్టుకోలేదు. జీవం లేని కదా, పాత్రల సమూహంలా ఉన్న ఆచార్య.. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయ్యింది. రెండో రోజే థియేటర్స్ నుండి వెళ్ళిపోయిన ఈ సినిమా భారీ నష్టాలు మిగిల్చింది.
ఇక ఆ తరువాత “ఆచార్య నష్టాలు” అనే సినిమా తీసినట్లుగా ఆ సినిమాని కొన్న బయ్యర్లు వారి నష్టాల తాలూకు కథ నడిచింది. ఈ క్రమంలో నష్టాలు భర్తీ చేయాలని కొంత మందు ఆందోళనకు దిగడం. మెగాస్టార్ చిరంజీవి భాధ్యత తీసుకోవాలి అని కొంత మంది, ఆయనకు బిజినెస్ తో సంబంధం లేదు ఈ సినిమా ఆర్థిక లావాదేవిలలో తలదూర్చిన కొరటాలనే ఆ భాధ్యత తీసుకోవాలి అని మరి కొందరు వాదించారు.
మొత్తానికి నిజానిజాలు ఎవరికీ తెలియదు కానీ ఆ ఆచార్య సినిమా వల్ల కొరటాల అందరికంటే ఎక్కువ నష్టపోయారనే వార్త ఇప్పటికీ బాగా ప్రచారంలో ఉంది. ఇక చిరంజీవి ఆచార్య సినిమా ఫలితంతో బాగా నిరాశ చెందినట్లు ఆయన ఇటీవలే చేసిన, చేస్తున్న వ్యాఖ్యల ద్వారా అందరికీ అర్థం అవుతుంది.
గతంలో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమాకి సంబందించిన ఫంక్షన్లో, అప్పుడప్పుడు పరిస్థితులు నా చేతిలో ఉండవు. వాటి గురించి అడగకండి అని ఆయన అన్న మాటలు పరోక్షంగా ఆచార్య గురించే అని అందరూ గ్రహించారు. అంతే కాకుండా సెట్స్ లో కొందరు దర్శకులు అప్పటికప్పుడు డైలాగ్స్ రాసి ఇస్తూ ఉంటారు. ఇడ్లీ వేడివేడిగా ఇవ్వాలి కానీ డైలాగ్స్ కాదు. ఈ విషయంలో టాలీవుడ్ దర్శకులు మారాలి అని కూడా అన్నారు.
ఇప్పుడు ఆయన తాజాగా నటించి విడుదలకు సిద్ధంగా ఉన్న గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ కోసం బాలీవుడ్ విమర్శకురాలు అనుపమ చోప్రాతో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆచార్య గురించి ప్రస్తావిస్తూ.. దర్శకుడు చెప్పింది మాత్రమే చేశామని, కానీ సినిమా పోయింది అన్నట్లు మాట్లాడారు. ఇది చిరంజీవికి ఏమాత్రం భావ్యం కాదు.
ఒక సినిమా విజయం సాధించినా, లేదా అపజయం పాలైనా అందులో అందరికీ భాగం ఉంటుంది. చిరంజీవి అనవసరంగా ప్రతిసారీ కొరటాల శివ పై నిందలు వేయడం ఏమాత్రం సరి కాదు.
ఆచార్య ఫలితం వల్ల చిరంజీవి బాధ పడి ఉండచ్చు, కానీ అపజయాన్ని కూడా స్వీకరించి ముందుకు వెళ్లాలి కానీ ఇలా మరొకరి మీద భారం వేయడం మాత్రం ఆయన స్థాయికి తగ్గ పని కాదు. ఇకనైనా చిరంజీవి ఆచార్య సినిమా విషయంలో ఆత్మ వంచన మాని ఆత్మ పరిశీలన చేసుకుని, కొరటాల శివ పై నిందలు వేయకుండా ఉంటే మంచిది.