మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అన్ని సినిమాలకిసంబంధించిన పోస్టర్స్, అప్ డేట్స్ ఎప్పటికప్పుడు విడుదల చేస్తూనే ఉన్నారు. అందులోనే బాబీ సినిమా కూడా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే సంచలనం రేపింది. మెగా 154 అంటూ విడుదలైన ఇందులో మెగాస్టార్ లుక్ చూసి అభిమానులు సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసారు. 2023 సంక్రాంతి కానుకగా ఈ సినిమాని విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
అయితే ప్రభాస్ నటిస్తున్న “ఆది పురుష్” కూడా సంక్రాంతికి విడుదల కానుంది. ఇది వరకే ఆ చిత్ర బృందం ఈ విషయాన్ని ప్రకటించింది.ఆదిపురుష్ చిత్రం రామాయణం ఇతిహాసం ఆధారంగా రూపొందించబడింది. ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ కనిపిస్తుండగా, సీతాదేవిగా కృతి సనన్,రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ .. లక్ష్మణుడిగా సన్నీ సింగ్,హనుమంతుడిగా దేవ్ దత్త కనిపించనున్నారు. ‘ఆదిపురుష్’ మూవీని పూర్తిగా గ్రీన్ మ్యాట్ పైనే చిత్రీకరించారట.
బాహుబలి తరువాత ప్రభాస్ సినిమా అంటే అన్ని భాషల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండటం సహజమే. అందులోనూ రామాయణం అంటే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమా కూడా సంక్రాంతికి విడుదల కానుంది అని చెప్పారు కనుక బాస్ కి ప్రభాస్ కి మధ్య బాక్స్ ఆఫీస్ వద్ద యుద్ధం తప్పేలా లేదు.
సంక్రాంతి సీజన్ అంటే రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవటం మామూలే.ఒకప్పుడు అయితే మూడు లేదా నాలుగు సినిమాలు విడుదల అయ్యేవి. క్రమంగా అది పెద్ద రెండు సినిమాలు, మరో రెండు చిన్న సినిమాలు విడుదల కావడం అలవాటుగా మారింది. ఆసక్తికరమైన ఈ పోటీలో అనుభవంతో మెగాస్టార్ గెలుస్తాడా లేదా ఆత్మవిశ్వాసంతో ప్రభాస్ గెలుస్తాడా అనేదిచూద్దాం.