మెగాస్టార్ చిరంజీవి మరో మలయాళ సినిమాని రీమేక్ చేయనున్నారు అనే వార్త తాజాగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. గాడ్ ఫాదర్ సినిమా పరాజయం తర్వాత అభిమానులు మెగా ఫ్యామిలీ హీరోలు రీమేక్‌లు చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే మెగా హీరోలు మాత్రం ఈ ఫీడ్‌బ్యాక్‌ని సీరియస్‌గా తీసుకోనట్లు కనిపిస్తుంది.
ఓటిటి విప్లవం తర్వాత అన్ని రకాల భాషల సినిమాలు ప్రేక్షకులకి చాలా సులువుగా అందుబాటులోకి వచ్చెసాయి. ఇలాంటి పరిస్థితుల్లో రీమేక్ అనేవి ఎంత మాత్రం లాభాన్ని చేకూర్చే ప్రయత్నం కాదని సర్వత్రా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బ్రో డాడీ మలయాళ పరిశ్రమ నుండి వచ్చిన హాస్యభరితమైన ఎంటర్‌టైనర్ మరియు ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి మెగాస్టార్ చిరంజీవి ఆసక్తిగా ఉన్నారని అంతర్గత వర్గాలు పేర్కొంటున్నాయి. మోహన్ లాల్, పృథ్వీరాజ్ తండ్రీకొడుకులుగా నటించిన మల్టీస్టారర్ చిత్రం బ్రో డాడీ. పృథ్వీరాజ్ ఈ చిత్రానికి రచయిత మరియు దర్శకుడుగా కూడా వ్యవహరించారు. తెలుగు రీమేక్‌లో మెగాస్టార్ తనయుడిగా మరో మెగా హీరో నటించే అవకాశం ఉందని సమాచారం.
తండ్రికి తెలియకుండా కొడుకు ఒక అమ్మాయితో సహజీవనం సాగించిన పరిస్థితుల్లో ఆ అమ్మాయి గర్భం దాల్చడం.. ఆ విషయంలో తండ్రి సలహా లేదా సహాయం ఆశించి వెళితే, తన తల్లి కూడా గర్భవతి అని బాంబు పెలుస్తాడు ఆ తండ్రి. ఇలాంటి విచిత్ర సంఘటనల నేపథ్యంలో హాస్యరసం ఎక్కువగా ఉంటూ తీసిన సినిమా బ్రో డాడీ.
ఈ సినిమా చాలా పరిమిత బడ్జెట్‌లో తీయవచ్చు. అలాగే కుటుంబ ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించే అవకాశం చాలానే ఉంది. సినిమాల్లోకి రీ-ఎంట్రీ అయిన తర్వాత తనలోని కామెడీ యాంగిల్‌ని చూపించే అవకాశాలు రాని చిరంజీవికి ఈ సినిమా ఆ సౌలభ్యం ఇస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి నుంచి చంటబ్బాయి, దొంగ మొగుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి హిలేరియస్ ఎంటర్‌టైనర్‌లనే మెగా అభిమానులు కూడా కోరుతున్నారు. ఈ సినిమా వారి కోరికను తీర్చి అందరూ ఆనందించే ఎంటర్‌టైనర్‌గా మారుతుందని ఆశిద్దాం.