నందమూరి బాలకృష్ణ గత యేడాది ఆహా ఓటీటీ వేదికగా అన్స్తాపబుల్ షో తో హోస్ట్ గా చేసిన సంగతి తెలిసిందే. “నేను మీకు తెలుసు..నా స్థానం మీ మనసు”అంటూ హోస్ట్‌గా తనదైన శైలిలో అన్‌స్టాపబుల్ షోను రక్తి కట్టించారు. మోహన్ బాబు తో మొదటి ఎపిసోడ్ చేయగా చివరి ఎపిసోడ్ మహేష్ బాబుతో చేయడం జరిగింది. ఈ షో కారణంగా ఆహా ఓటీటీకి సబ్‌స్క్రైబర్స్‌కు భారీగా పెరిగారని కూడా తెలిసింది.
ఈ షో సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం సినిమాల్లో ఎక్కువగా గంభీరంగా,భారీ సంభాషణలు పలికే బాలకృష్ణ షోలో మాత్రం సరదాగా గెస్ట్ లతో జోక్ లు వేస్తూ మధ్యలో తన మీద కూడా జోక్ లు వేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ యాంగిల్ బాలయ్యలో మునుపెన్నడూ చూడలేదే అని ప్రేక్షకులు అభిప్రాయ పడ్డారు.
అలాగే తన మీద వచ్చే రూమర్ లు వగైరాల మీద కూడా వివరణ ఇచ్చుకోవడం చేసి బాలకృష్ణ శభాష్ అనిపించుకున్నారు. ముఖ్యంగా తనకు రవితేజ మధ్య గొడవ అయ్యిందని దశాబ్దం క్రితం నుంచి ఉన్న రూమర్లకు బాలయ్య చెక్ పెట్టారు.స్వయంగా రవితేజతోనే క్లారిటీ ఇప్పించడం ఆయనకే చెల్లింది.
కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా ప్రతి ఎపిసోడ్ లో సమాజంలో కష్టాలు ఎదురీదుతున్న వారిని పరిచయం చేసి వాళ్ళకి చేతనైన సహాయం చేయడం కూడా షోకు మంచి పేరు తీసుకువచ్చింది.సరదాగా మాట్లాడుతూనే గెస్ట్ లను ఎమోషనల్ జర్నీలో తీసుకెళ్లడంలో బాలకృష్ణ సక్సెస్ అయ్యారు అనే చెప్పాలి. జనవరిలో అన్‌స్టాపబుల్ మొదటి సీజన్ చివరి ఎపిసోడ్ ప్రసారం అయింది, అప్పట్నుంచి సీజన్ 2 ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు, మొత్తానికి వారి ఎదురుచూపులు ఫలించాయి.
అన్‌స్టాపబుల్ సీజన్ 2 తొందరలోనే మొదలవుతుందని, ఆ సీజన్ మొట్టమొదటి గెస్ట్ మెగాస్టార్ చిరంజీవి అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే గనుక నిజం అయితే టీఆర్పిల రికార్డ్ మోగిపోయే ఎపిసోడ్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.మెగా – నందమూరి కలయిక ఎలా ఉండబోతుందో త్వరలోనే చూడబోతున్నాం.