మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఇటీవలే అమెరికా పయనం అయిన సంగతి తెలిసిందే. మార్చి 13న ఆస్కార్ (Oscars 2023) ఫలితాలు వెల్లడించనున్న సందర్భంలో ఆ కార్యక్రమానికి ఆయనతో పాటు ఆర్ ఆర్ ఆర్ చిత్ర బృందం కూడా హాజరు కానున్నారని సమాచారం. అయితే, అంతే కంటే ముందు మరో అవార్డు కార్యక్రమానికి ఆయన వెళ్ళనున్నారు. అయితే అది అతిథిగా కాదు ప్రెజెంటర్ గా వెళ్లనున్నారు.
HCA అనగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ సంస్థ ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా విడుదలయిన సినిమాల్లో అత్యుత్తమ సినిమాలను గుర్తించి అవార్డులు అందజేస్తుంది. కాగా ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఈ ఏడాది హెచ్.సి.ఎ అవార్డులకు నాలుగు విభాగాల్లో నామినేట్ అయ్యింది.
సినిమా, దర్శకత్వం, అంతర్జాతీయ సినిమా, యాక్షన్ ఫిల్మ్ విభాగాల్లో హాలీవుడ్ సినిమాలతో ‘ఆర్ఆర్ఆర్’ పోటీ పడుతోంది. అవార్డులు ఏయే విభాగాల్లో వస్తాయి? అనేది ఈ నెల 24న బెవర్లీ హిల్స్ లో జరుగుతున్న కార్యక్రమంలో తెలుస్తుంది. ఇక ఈ పురస్కారాల కార్యక్రమంలో వేదిక పై రామ్ చరణ్ సందడి చేయనున్నారు. ఆయన్ను ప్రజెంటర్ గా హెచ్.సి.ఎ ఆహ్వానించడం విశేషం.
హెచ్.సి.ఎ అవార్డుల్లోని విజేతలలో ఒకరికి రామ్ చరణ్ అవార్డు ఇవ్వనున్నారు. ఇలా ఒక హాలీవుడ్ సంస్థ నుండి పిలుపు అందుకుని ఆ అరుదైన ఘనత అందుకున్న తొలి హీరోగా రామ్ చరణ్ చరిత్ర సృష్టించారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు అంటూ సాగే ఊర మాస్ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ పాటకు ఆస్కార్ అవార్డు రావడం ఖాయమని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకి ఉన్న క్రేజ్ మరియు ట్రెండ్ చూస్తే ఆ అవార్డు మన తెలుగు పాటకు రావడం ఖాయం అనే అనిపిస్తుంది.
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) చిత్రం మార్చి 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి , ప్రపంచ వ్యాప్తంగా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.