త్రివిక్రమ్ – అల్లు అర్జున్ ల కాంబినేషన్లో వచ్చిన “జులాయి” సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ” లాజిక్లులు ఎవరూ నమ్మరు. అందుకే మన దేశంలో సైంటిస్ట్ ల కంటే బాబాలు ఫేమస్” అనే డైలాగ్ ఉంటుంది. అదే డైలాగ్ కొంత మారిస్తే.. మన సోషల్ మీడియాలో తెలుగు సినీ ప్రేక్షకులు, ముఖ్యంగా మన స్టార్ హీరోల అభిమానుల ప్రవర్తనకు సరిగ్గా సరిపోతుంది. అదేంటంటే.. ఫ్యాన్స్ కి ఎమోషన్స్ మాత్రమే.. లాజిక్స్ పట్టవు.
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించగా . భారీ హైప్ తో ఈ ఏడాది మార్చి 25న విడుదలైన ఆర్ ఆర్ ఆర్ అటు బాక్స్ ఆఫీస్ పరంగా ఇటు ప్రశంసల పరంగా ఎంత ఖ్యాతి గడించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆ సినిమా విడుదలైన దగ్గర నుంచి మెగా – నందమూరి అభిమానుల మధ్య ఏదో రకంగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
గత నెలలో, ప్రముఖ లైఫ్‌స్టైల్ మరియు పాప్ కల్చర్ మ్యాగజైన్ వెరైటీ వారి వార్షిక అంచనాల జాబితాలో ఆస్కార్‌కు వారి అంచనా వేసిన నామినీల జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ పేరును చేర్చింది. ఈ జాబితా వచ్చినప్పుడు చాలా మంది మెగా అభిమానులు ఈ విషయాన్ని తీసి పారేసి ఎన్టీఆర్ మరియు ఆయన అభిమానులను ఎగతాళి చేశారు. అంతే కాకుండా ఇది కేవలం డబ్బులు ఇచ్చి జరిపించుకున్న పనిగా కూడా పేర్కొన్నారు.
ఆ సమయంలో నిజానికి ఇందులో ఎన్టీఆర్ ప్రమేయం ఉందని చాలా మంది సోషల్ మీడియాలో ప్రచారం చేయగా, రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ గారు తన ప్రభావంతో ఇలా చేశారని కూడా కొందరు పేర్కొన్నారు.
అయితే, ఇప్పుడు పరిస్థితి మారింది. అచ్చం సినిమాలో వచ్చే ట్విస్ట్ లాగా, వెరైటీ వెబ్‌సైట్ రామ్ చరణ్‌ని కూడా తమ తాజా ఆస్కార్ నామినేషన్ అంచనాల జాబితాలో చేర్చడంతో.. ఇప్పుడు మెగా అభిమానులు తమ హీరోని పొగడడం మొదలుపెట్టారు. అయితే అప్పుడు మెగా అభిమానులు చేసిందే ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు చేస్తూ మెగా అభిమానుల పై దాడి చేయడం ప్రారంభించారు.
వెరైటీ మ్యాగజైన్‌లో కనిపించడానికి రామ్ చరణ్ మరియు అతని బృందం కూడా డబ్బు చెల్లించిందని ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమానులు ఆరోపిస్తున్నారు. మెగా అభిమానులకు బూమరాంగ్ లాగా చేసిన ఆరోపణలు మళ్ళీ తిరిగి వచ్చినట్లు పరిస్తితి ఏర్పడింది.
నిజానికి ఈ మొత్తం వ్యవహారంలో ఇరు వర్గాల అభిమానుల తప్పూ ఉంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలైన రోజు నుండి నిన్న మొన్నటి వరకూ ఎన్టీఆర్ అభిమానులు రాజమౌళి పై సోషల్ మీడియాలో హేయమైన వ్యాఖ్యలు చేసి అకారణంగా నిందలు కూడా మోపారు. అందువల్ల మెగా అభిమానులు మొదటి నుంచి ఈ సినిమాలో తమదే పై చేయి అన్నట్లు వ్యవహరించారు.
అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం మొదలైన దగ్గర నుంచి ఎన్టీఆర్ అభిమానులు మళ్ళీ సినిమాని తిరిగి పొగడటం మొదలు పెట్టారు. ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ అవార్డుకు ఎంపికయ్యే అవకాశం ఉన్న తరుణంలో ఇరు వర్గాల అభిమానులు ఈ చిల్లర గొడవలు పక్కనపెట్టి సమిష్టిగా ఉంటే మంచిది.