మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు అని మొదటినుంచి వార్తలు వస్తున్నాయి. గతంలో అన్నయ్య సినిమాలో చిరంజీవి తమ్ముడిగా నటించిన రవితేజ.. తాజాగా మరోసారి మెగాస్టార్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రుతి హాసన్ నటిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ అనధికారికంగా ప్రచారంలో ఉంది.
ఇక ఈ సినిమా షూటింగ్ సెట్స్‌లో గురువారం రవితేజ అడుగుపెట్టారని సమాచారం. చిరంజీవి తమ్ముడిగా రవితేజ కనిపిస్తున్నారని రకరకాల పుకార్లు మరియు ఊహగానాలు వస్తున్నాయి. అన్నయ్య సినిమాలో చిరంజీవి తమ్ముడిగా మెప్పించిన మాస్ మహారాజా.. శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో ఓ పాటలో కూడా కనిపించారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మెగాస్టార్‌తో నటించబోతుండడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. వీరిద్దరి కలిస్తే ఆ దృశ్యం ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో రవితేజ నటిస్తున్న విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉండగా.. ఎట్టకేలకు ఈరోజు ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ధృవీకరించింది.
ఈ మేరకు మైత్రి మూవీ మేకర్స్ తమ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఒక పోస్టర్ మరియు వీడియోను విడుదల చేసింది. మెగాస్టార్ మరియు మాస్ మహరాజ్ చేతులు కలిసిన పోస్టర్ చాలా బాగుంది.
ఇక వీడియోలో రవితేజ కార్ దిగే ఘట్టాన్ని ఒక సినిమాలో సీన్ లాగా ఎలివేట్ చేశారు. మాస్ తో పెట్టుకుంటే మడతడి పొద్ది పాట రీమిక్స్ లాగా బ్యాక్ గ్రౌండ్ లో వస్తూ ఎంట్రీ ఇచ్చిన రవితేజ. “అన్నయ్యా “అంటూ మెగాస్టార్ కారావాన్ డోర్ తెరవడం.. దానికి శంకర్ దాదా మ్యూజిక్ తో చిరంజీవి వెల్కమ్ అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వడం చూస్తేనే ఒక రకమైన చక్కని అనుభూతి కలుగుతుంటే.. ఇక వెండితెరపై వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు ఎలా ఉంటుంది అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగించేలా విడియో అద్భుతంగా ఉంది.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. గాడ్ ఫాదర్, భోళాశంకర్, మెగా 154 చిత్రాలను చకచకా పూర్తి చేసే పనిలో ఉన్నారు వీటిలో ముందుగా గాడ్ ఫాదర్ సినిమా రానుంది. మోహన్ రాజా దర్శకత్వంతో మలయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫర్‌కు రీమెక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇక మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే సినిమా కూడా చేస్తున్నారు.ఇక రవితేజ రామారావు ఆన్ డ్యూటీ చిత్రం ఈ నెల 29న విడుదలకు సిద్ధంగా ఉంది. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సముద్రఖని విలన్ గా నటిస్తుండగా.. 9 ఏళ్ళ తరువాత హీరో వేణు ఈ సినిమలో ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తుందటం విశేషం.