తెలుగు చిత్ర పరిశ్రమలో రీరిలీజ్ ట్రెండ్ మరికొన్ని బ్లాక్ బస్టర్స్ కు మరింత విస్తరిస్తూ వస్తుంది. సూపర్ స్టార్ హీరోల సినిమాల రీ రిలీజ్ హవా తర్వాత మాస్ మహారాజా రవితేజ నటించిన మిరపకాయ్ కూడా ఈ లిస్ట్ లో చేరిపోయింది. జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది.
రవితేజ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘మిరపకాయ్’. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది రెండో సినిమా కాగా, అంతకు ముందు రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో షాక్ అనే సినిమా వచ్చింది. రిచా గంగోపాధ్యాయ, దీక్షా సేథ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించగా అప్పట్లో మిరపకాయ్ సినిమాలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి.
కిట్టు బాయి (ప్రకాష్ రాజ్)ని వేటాడే పనిలో ఉన్న రిషి (రవితేజ) అనే పోలీస్ కథే మిరపకాయ్. విధి నిర్వహణలో అండర్ కవర్ పోలీస్ గా హైదరాబాద్ కు షిఫ్ట్ అయి కిట్టు అనుచరుడు శంకర్ అన్న (కోట శ్రీనివాసరావు) కు చెందిన కాలేజీలో హిందీ ప్రొఫెసర్ గా చేరతాడు. కాలేజ్ లో స్టూడెంట్ వినమ్ర (రిచా గంగోపాధ్యాయ)తో ప్రేమలో పడతాడు.
ఇక రిషి – వినమ్ర మధ్య ప్రేమ చిగురించే సమయంలో తన బాస్ అతన్ని మళ్ళీ పిలిపించి కిట్టుబాయి కూతురు వైశాలి (దీక్షా సేథ్)తో రొమాన్స్ చేయమని అడుగుతాడు. రిషి ఈ రెండు రొమాంటిక్ ట్రాక్ లను నడుపుతూ రౌడీ కిట్టును పట్టుకోవడమే మిగతా కథ.
2011 సంక్రాంతి సీజన్ లో నందమూరి బాలకృష్ణ నటించిన పరమ వీరచక్ర, సిద్ధార్థ్ నటించిన అనగనగా ఒక ధీరుడు, సుమంత్ నటించిన గోల్కొండ హైస్కూల్ చిత్రాలు మిరపకాయ్ తో పాటు విడుదలయ్యాయి. కాగా అన్ని చిత్రాల్లో రవితేజ సినిమా విజేతగా నిలిచింది.