మంచు మనోజ్ రెండో పెళ్లి వార్త గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారింది. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన మంచు మోహన్ బాబు కుమారుడు మనోజ్, దివంగత టీడీపీ నేత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనికను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా వీరిద్దరి రెండో పెళ్లి వార్త వైరల్ గా మారింది.
మంచు మనోజ్ 2015లో ప్రణతి రెడ్డిని వివాహం చేసుకోగా, 2019లో వారిద్దరూ విడిపోయారు. అప్పట్లో ఆయన ఓ బహిరంగ ప్రకటన కూడా విడుదల చేశారు. మనోజ్, మౌనిక పెళ్లికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా రాకపోయినా.. త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం వస్తూ ఉండింది.
ఈరోజు మనోజ్ తన ట్విట్టర్ ఖాతాలో… ‘ నా మనసుకి చాలా దగ్గరైన ఈ ప్రత్యేక వార్తను నేను కొంతకాలంగా దాచిపెట్టాను. ఇప్పుడు నేను నా జీవితంలో తదుపరి దశలోకి ప్రవేశించడానికి ఉత్సాహంగా ఉన్నాను. ఈ విషయాన్ని 2023 జనవరి 20న ప్రకటిస్తాను. ఎప్పటిలాగే మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి’ అని ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ నెటిజన్లను అయోమయానికి గురి చేసింది. మంచు మనోజ్ రెండో పెళ్లి గురించి చేసిన ట్వీట్ ఆ లేక కొత్త సినిమా గురించా? అనే విషయం పై క్లారిటీ రావాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.
ఇదిలా ఉంటే మనోజ్ తన పర్సనల్ లైఫ్ లో ఇబ్బంది తలెత్తడంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ‘అహం బ్రహ్మాస్మి’ అనే టైటిల్ తో గతంలో సినిమా అనౌన్స్ చేసినా ఆ సినిమాకి సంభందించి ఎటువంటి పురోగతీ లేదు.
చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కు పరిచయమైన మంచు మనోజ్ 2004లో ‘దొంగ దొంగ’ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేశారు. ఆ పైన వరుసగా మంచి సినిమాలతో నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు అభిమానులను కూడా సంపాదించుకున్నారు. ఆ సమయంలో తోటి హీరోలతో పోలిస్తే కథల ఎంపికలో మనోజ్ కొత్తదనం చూపించారు.
అయితే ఆ తరువాత వరుస ఫ్లాపులను ఎదుర్కోవడంతో నటుడిగా, స్టార్ గా మనోజ్ తన ఇమేజ్ కోల్పోయి సినిమాలు తగ్గించేశారు. చివరిగా శ్రీకాంత్ నటించిన ఆపరేషన్ 2019 సినిమాలో అతిథి పాత్రలో కనిపించిన మనోజ్ అప్పటి నుంచి వెండితెరకు దూరంగా ఉంటున్నారు.