ఇటీవల మలయాళ చిత్ర పరిశ్రమలో పలు సినిమాలు విజయాలు సొంతం చేసుకుని అక్కడి నిర్మాతలకు కాసులు కురిపించాయి. ఆ విధంగా ఫిబ్రవరిలో మంచి అంచనాలతో రిలీజ్ అయిన మూవీ మంజుమ్మేల్ బాయ్స్. ఈ మూవీని యువ దర్శకుడు చిదంబరం తెరకెక్కించగా కీలక పాత్రల్లో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్. పొదువల్, లాల్ జూనియర్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్, అరుణ్ కురియన్, ఖలీద్ రెహమాన్ తదితరులు నటించారు.
రిలీజ్ అనంతరం అతిపెద్ద సంచలన విజయం అందుకుంది ఈ మూవీ. విషయం ఏమిటంటే, ఈ మూవీలో కొన్నేళ్ల క్రితం కమల్ హాసన్ నటించి ఇళయరాజా స్వరపరిచిన గుణ మూవీలోని ప్రియతమ నీవచట కుశలమా అనే సాంగ్ ని పలు చోట్ల మాంటేజ్ సాంగ్ గా వాడుకున్న విషయం తెలిసిందే.
అయితే ఆ సాంగ్ ని తన అనుమతి లేకుండా తమ సినిమాలో వాడుకున్నందుకు సంగీత దర్శకుడు ఇళయరాజా ఇటీవల మంజుమ్మేల్ బాయ్స్ యూనిట్ పై కోర్ట్ లో కేసు వేశారు. కాగా దానిపై తాజాగా తీర్పు వెలువరించిన కోర్టు, ఇళయరాజా అనుమతి లేకుండా ఆ సాంగ్ వాడుకున్నందుకు మంజుమ్మేల్ బాయ్స్ మూవీ టీమ్ ఆయనకు రూ. 60 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. మొత్తంగా ఈ కేసులో ఇళయరాజా విజయం సాధించారు.