ఈ ఏడాది వేసవిలో విడుదలై అతి పెద్ద డిజాస్టర్‌గా మారినప్పటి నుంచి ఆచార్య సినిమా వివాదాలు సృష్టిస్తూ ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ‘విజయానికి చాలా మంది స్నేహితులు ఉంటారు, కానీ అపజయం అనాథగా మిగిలిపోతుంది’ అని ఇండస్ట్రీలో ఒక సామెత ప్రసిద్ధిలో ఉంది. ఆచార్య విషయంలో కూడా ప్రస్తుతం అదే జరుగుతోంది.
ఆచార్య సంగీతం గురించి మణిశర్మ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు అదే కొటేషన్‌ను పునరుద్ఘాటించిన విధంగా పరిస్థితి ఏర్పడింది.
మెగాస్టార్ చిరంజీవి ఇటివలే ఫిల్మ్ కంపానియన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆచార్య ఫలితాన్ని పూర్తిగా దర్శకుడి పై ఆపాదించడం కనిపించింది. దర్శకుడు ఏది చెబితే అది తాను, రామ్ చరణ్ చేశామని, అందుకే ఫలితం కొరటాల మీద ఉందన్నట్లుగా ఆయన అన్నారు.
అదే ట్రెండ్‌ను అనుసరించి, హాస్యనటుడు అలీ వ్యాఖ్యాతగా చేస్తున్న అలీతో సరదాగా కార్యక్రమానికి హాజరైన మణిశర్మ, దర్శకుడి నిర్ణయాన్ని నిందించడం ద్వారా ఆచార్య సినిమాకు తాను ఇచ్చిన బలహీనమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో తన తప్పేమీ లేదని సమర్థించుకున్నారు.
తాను ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశానని, మెగాస్టార్ సినిమాలకు మ్యూజిక్ పరంగా ఏం అవసరమో తనకు తెలుసునని మణిశర్మ అన్నారు. అయితే కొరటాల మాత్రం కొత్త తరహా సంగీతం ఇవ్వాలని పట్టుబట్టడంతో తన నిర్ణయాన్ని మార్చుకుని దర్శకుడు చెప్పినట్లు చేయాల్సి వచ్చిందని మణిశర్మ తెలిపారు.
సాధారణంగా సినిమా విషయంలో కీలక నిర్ణయాలు దర్శకులే తీసుకుంటారు. కొత్త యుగంలో దర్శకులు 24 క్రాఫ్ట్‌లలోని ప్రతి అంశాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తారు. కొరటాల కూడా అదే చేసి ఉండవచ్చు, కానీ ఆచార్య చిత్ర బృందం నుండి చాలా మంది అతని పై నిందలు వేస్తుండటంతో అందరికంటే ఎక్కువ విమర్శలు ఆయన మీదే వస్తున్నాయి.
నిజానికి ఆచార్య సినిమా ఇండస్ట్రీలో మొదటి డిజాస్టర్ ఏమీ కాదు. కేవలం ఒక ఫ్లాప్ ఇచ్చినందుకు కొరటాలని అందరూ పంచ్‌బ్యాగ్‌గా మార్చారు. ఇది ఎంత మాత్రం మంచి సంకేతం కాదు, ఎవరికైనా సినిమా తీయడంలో తప్పులు జరుగుతాయి. ఆ మాత్రానికే ఒక్కరిని చేసి అనడం సరి కాదు.
దర్శకుడు కొరటాల శివ పై ఈ నిందల పర్వం త్వరలోనే ఆగిపోతుందని.. మరియు కొరటాల శివ ఎన్టీఆర్ 30తో సాధ్యమైనంత ఉత్తమమైన అవుట్‌పుట్‌ను అందించి తని సామర్థ్యాన్ని నిరూపించుకుంటారని ఆశిద్దాం.