మోహన్ బాబు గతంలో తన సొంత బ్యానర్ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌లో భారీ బ్లాక్‌బస్టర్స్ మరియు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ సాధించారు. అందుకే అభిమానులు మరియు మీడియా ఆయనను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అని పిలుచుకునే వారు. అయితే కాలం మారింది ఆయన తాజాగా నిర్మాతగా వ్యవహరించగా ఆయన కుమారుడు మంచు విష్ణు కథానాయకుడిగా నటించిన జిన్నా చిత్రం నష్టాలలో కొత్త రికార్డులను బద్దలు కొట్టింది.
విష్ణు మంచు తాజాగా నటించిన చిత్రం జిన్నా.. ఈ చిత్రం దీపావళి పండుగ సందర్భంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద పేలవమైన సమీక్షలను తెచ్చుకోవడంతో పాటు దారుణమైన కలెక్షన్లను నమోదు చేసింది. విష్ణుకి ఉన్న మార్కెట్ బలం కంటే భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం నిర్మించబడింది.
కాగా దాదాపు 20 కోట్లకు పైగా బడ్జెట్ ఈ చిత్రానికి కేటాయించినట్లుగా ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది నిజంగా మంచు విష్ణు ఇప్పటి వరకు చేయనటువంటి అత్యంత భారీ బడ్జెట్ చిత్రం అనే చెప్పాలి.
ఇక జిన్నా సినిమాలో ఇద్దరు గ్లామరస్ హీరోయిన్స్ కూడా ఉన్నారు, ఒకరు RX100 ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ కాగా మరొకరు సన్నీ లియోన్.. ఈవిడ పేరుకు కొత్తగా పరిచయం కూడా అవసరం లేదు. కాగా జిన్నా చిత్రానికి కోన వెంకట్ స్క్రీన్ ప్లే రాశారు. మరో సీనియర్ దర్శకుడు కథ అందించారు. అలాగే ప్రముఖ కెమెరా మెన్ ఛోటా కె నాయుడు కెమెరా బాధ్యతను చూసుకున్నారు.
సినిమాకి పని చేసిన వార్లలో ఇన్ని పెద్ద పేర్లు ఉన్నప్పటికీ.. సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఒక చక్కని ఎంటర్టైనర్ ను ఆశించిన ప్రేక్షకులకు.. అలాగే లాభాల పంట పండించాలనే ఆలోచనలో ఉన్న మోహన్ బాబు బ్యానర్‌కు కూడా మరోసారి నిరాశను మిగిల్చింది.
జిన్నా సినిమాను మంచు వారు తమ సొంత ప్రొడక్షన్ హౌస్ ద్వారా విడుదల చేసారు. అయితే ముందుగానే చెప్పుకున్నట్లు కలెక్షన్లు చాలా తక్కువగా వచ్చాయి. అలాగే కొన్ని ఏరియాలలో కనీస స్థాయిలో కూడా కలెక్షన్లు రాబట్టడంలో జిన్నా చిత్రం విఫలం అయింది.
బాక్సాఫీస్ వద్ద ఈ రకమైన ఆదరణ పొందటం వల్ల, జిన్నా సినిమాకి నాన్ థియేట్రికల్ వ్యాపారం నుండి కూడా ఎటువంటి సహాయం లభించకపోవచ్చు. విష్ణు తన సేఫ్ జానర్, కామెడీ ఎంటర్‌టైనర్ సినిమా చేసినప్పటికీ సినిమా ఫలితం పూర్తిగా ఆయనను నిరుత్సాహపరుచింది.
మళ్ళీ ఢీ వంటి ఒక అద్భుతమైన ఎంటర్టైనర్ తో తిరిగి సూపర్ హిట్ సినిమా సాధిస్తారని ఆశిద్దాం. అలా జరిగితే ఆ సినిమా లాభాలను అర్జించడమే కాక మంచు విష్ణు కెరీర్‌కు అవసరమైన ఊపుని కూడా అందిస్తుంది.