గత కొంత కాలంగా అందరి దృష్టికి దూరంగా ఉన్న నటుడు మంచు మనోజ్.. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఒక గణేష్ పండల్ వద్ద కనిపించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి చిన్న కూతురు భూమా మౌనిక రెడ్డి కూడా మనోజ్ తో పాటు కనిపించారు.
అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం, మనోజ్ త్వరలో మౌనికతో పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో మీడియాతో ఇంటరాక్ట్ అయిన మనోజ్ తన రెండో పెళ్లి గురించి కూడా ఓపెన్ అయ్యారు. ఇక వేదిక వద్ద నటుడి ప్రదర్శన అక్కడ ఉన్న ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతే కాకుండా ఆయనను కలవడానికి అక్కడున్న ప్రజలు మూకుమ్మడిగా పండల్ వద్దకు చేరుకున్నారు.
మంచు మనోజ్ 2015 లో ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్నారు. అయితే వారి వైవాహిక జీవితం సవ్యంగా సాగలేదు. అందువల్ల 2019 సంవత్సరంలో వారివురూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం మీద అప్పట్లో బహిరంగ ప్రకటన కూడా విడుదల చేశారు. ఇక మనోజ్ మరియు మౌనికల వివాహానికి సంబంధించిన అధికారిక ప్రకటన, ఇతర వివరాలు ఇంకా బయటకు రాలేదు. త్వరలోనే ఈ విషయం ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.
ఇక నటుడుగా మనోజ్ కెరీర్ కూడా ఒడిదుడుకులలో ఉంది. కొన్నాళ్ళుగా, సరైన విజయం లేని ఆయన సినిమా చేసి కూడా చాలా రోజులు అయింది. మనోజ్ చివరిసారిగా శ్రీకాంత్ నటించిన ఆపరేషన్ 2019 సినిమాలో అతిధి పాత్రలో కనిపించారు. ఆ తరువాత నుండి మనోజ్ సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. గత సంవత్సరం MAA ఎన్నికలలో తన సోదరుడు విష్ణు అభ్యర్థిత్వంలో, ఆయనను గెలిపించడంలో మనోజ్ చురుకైన పాత్ర పోషించారు.
ఇక మౌనిక విషయానికి వస్తే, కర్నూలు జిల్లాకు చెందిన రాజకీయ నేపధ్యం కలిగిన భూమానాగిరెడ్డి, శోభానాగిరెడ్డి దంపతుల రెండో కుమార్తెనే భూమా మౌనికారెడ్డి..మౌనికారెడ్డికి కూడా మొదట బెంగుళూరుకు చెందిన గణేష్‌రెడ్డితో వివాహం జరిగింది. వీరిద్దరికి ఐదేళ్ల బాబు కూడా ఉన్నాడు. రెండేళ్ల క్రితమే మౌనికారెడ్డి గణేష్‌రెడ్డితో విడాకులు తీసుకున్నారు.