ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించింది అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పలు మార్లు రిలీజ్ వాయిదా పడిన ఆర్ ఆర్ ఆర్ ఎట్టకేలకు ఈ ఏడాది మార్చి 25న విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే.అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్ ఆర్ ఆర్ సినిమా సృష్టించిన సంచలనం.. సంపాదించిన పేరు అంతా ఇంతా కాదు. భారత దేశ చలన చిత్ర చరిత్రలోనే ఏ సినిమాకీ దక్కనటువంటి అంతర్జాతీయ ఆదరణ ఆర్ ఆర్ ఆర్ కు లభించింది అంటే అది ఎంత మాత్రం అతిశయోక్తి కానే కాదు.
ఆర్ ఆర్ ఆర్ విజయంతో రాజమౌళి భారతీయ సినిమాకు ఒక ముఖచిత్రంలా మారిపోయారు. ఇంతటి భారీ స్పందనను మార్కెట్ గా మార్చే పనిలో నిమగ్నమై ఉన్నారు రాజమౌళి. ఆయన తదుపరి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఖరారు ఆయిన సంగతి తెలిసిందే.మహేష్ తో చేయబోయే సినిమాను అత్యంత భారీ స్ధాయిలో తెరకెక్కించనున్నారట. సాంకేతికంగా ఎక్కడా అత్యున్నత ప్రమాణాలు కలిగిన సినిమాగా మలిచే ప్రయత్నంలో అన్ని జాగ్రత్తలు తీసుకొనున్నారట.
దాదాపు సినిమా అంతా కంప్యూటర్ గ్రాఫిక్స్ అవసరం అవుతుందని, భారతీయ చలన చిత్ర చరిత్రలో ఏ సినిమాకీ ఇంత వరకూ ఉపయోగించని స్థాయిలో ఈ సినిమాకి గ్రాఫిక్స్ హంగులు అద్దబోతున్నారని తెలుస్తుంది.ఆర్ ఆర్ ఆర్ తరువాత రాజమౌళి తెరకెక్కించే సినిమా కాబట్టి ఖచ్చితంగా ఈ చిత్రానికి ఆకాశాన్ని తాకే అంచనాలు ఉంటాయి. అటు మహేష్ బాబు కి ఉండే అల్ రౌండర్ ఇమేజ్ మరియు టాలెంట్ కు, ఇటు రాజమౌళి కి ఉన్న కష్టపడే తత్వం.. ప్రతి సినిమాకూ తనని తాను మెరుగు పరుచుకుంటూ వెళ్ళే ఆయన తపన అన్నీ కలిసి, ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడానికి కూడా వీలు లేనంతగా వారిద్దరి కలయికలో వచ్చే ఈ సినిమా ఉండబోతుంది.
ఇప్పటికైతే ఈ చిత్రానికి సంబంధించి కథ, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరు ఎంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ తో తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నారు. ఆ తరువాత రాజమౌళి తో సినిమా ఉంటుంది.ఈ చిత్రం తెరకెక్కించడానికి ఖచ్చితంగా కాస్త ఎక్కువ సమయం తీసుకున్నా, యావత్ భారత దేశంలో ఉన్న సినీ ప్రేక్షకులనే కాక అంతర్జాతీయ ప్రేక్షకులనూ రంజింపచేసేలా ఒక అద్భుతమైన సినిమా రాబోతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు.