తెలుగు చిత్ర పరిశ్రమ నుండి వస్తున్న అంతర్గత వర్గాల నివేదికలు వెల్లడిస్తున్నది నిజమే అయితే, 2024 సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల మధ్య ఒక క్లాష్ ని మనందరం చూడబోతున్నాము.
మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ తో SSMB28 సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాని ఆగష్టులో విడుదల చేయడానికి నిర్మాతలు అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తవుతుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
ఇక పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాణ పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. కాగా ఏప్రిల్ మొదటి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. సంక్రాంతి రిలీజ్ లక్ష్యంగా చిత్ర యూనిట్ పని చేయనుంది. దీని కంటే ముందు పవన్ కళ్యాణ్ తను ముఖ్య అతిథి పాత్రలో నటిస్తున్న వినోదయ సీతం రీమేక్ ను విడుదల చేయనున్నారు.
ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ ప్రాజెక్ట్ కె, రామ్ చరణ్ – శంకర్ ఆర్ సి 15 సినిమాలు కూడా ప్రస్తుతానికి 2024 సంక్రాంతిని లక్ష్యంగా పెట్టుకున్నాయి, అయితే షూటింగ్ లో ఆలస్యం మరియు ఇతర కారణాల వల్ల ఈ రెండు సినిమాలు సమ్మర్ లో వచ్చే అవకాశాలే ఎక్కువని సమాచారం అందుతోంది.
కాబట్టి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సినిమా సంక్రాంతి స్పెషల్ గా విడుదల కావడం దాదాపు ఖాయమని అంటున్నారు. ఇక పైన చెప్పినట్టు మహేష్ బాబు సినిమా వేరే కారణాల వల్ల ఆగస్టులో విడుదల కాకపోతే ఈ సినిమా కూడా సంక్రాంతికి రావడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి ఈ ఇద్దరు స్టార్ల మధ్య పోటీ అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకులను కూడా ఉత్సాహపరుస్తుంది. అయితే ఈ క్లాష్ నిజంగా జరుగుతుందో లేదో వేచి చూడాలి.