సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తూ.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB28 టాలీవుడ్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా చెప్పుకోవచ్చు. 12 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. తెలుగు సినీ అభిమానుల హృదయాల్లో ఈ కాంబినేషన్‌కు చాలా ప్రత్యేక స్థానం ఉంది. అందుకే సినిమాలోని అన్ని అంశాలూ ఉత్తమ నాణ్యతతో ఉండేలా ఎక్కడ కూడా పొరపాట్లు రాకుండా చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.
కాగా మహేష్ – త్రివిక్రమ్ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో సెప్టెంబర్ 12న స్టార్ట్ అయ్యింది. ఇక అక్కడ షూటింగ్ ముగించుకుని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ అవుట్ డోర్ యాక్షన్ సీక్వెన్స్ తీయడానికి సన్నాహాలు చేశారు.
కాగా ఈ షూటింగ్ షెడ్యూల్ లో భాగంగా భారీ యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరించారు. అయితే ఆ ఫైట్లు వచ్చిన తీరు పై మహేష్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. అందుకే వ్యవహారం మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడని సమాచారం.
నిజానికి చిత్ర బృందం ఈ యాక్షన్ సన్నివేశాల కోసం ఒక నెల రోజుల షెడ్యూల్ కూడా ప్లాన్ చేసింది, అయితే సూపర్ స్టార్ మహేష్ యాక్షన్ సన్నివేశాల అవుట్‌పుట్ చూసి ఫైట్ మాస్టర్లను మొత్తంగా మార్చాలని నిర్ణయించుకున్నారట.
అయన తీసుకున్న నిర్ణయంలో తప్పు లేదు. ఎందుకంటే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు చాలా ప్రాధాన్యత ఉంటుందట. మరి అలాంటప్పుడు అన్ని విషయాల్లోనూ చాలా జాగర్తగా ఉంటేనే కదా సరైన విధంగా సినిమా తీసేందుకు వీలుగా ఉంటుంది.
కాగా ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు. మహేష్ తో పాటు పూజాకి కూడా త్రివిక్రమ్ తో ఇది హ్యాట్రిక్ సినిమా కావడం విశేషం. ఇక ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించే నటీనటుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
చిత్ర నిర్మాతలైన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ గత సంవత్సరం ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించి మహేష్ అభిమానులను ఆనందపరిచారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.