తెలుగు సినిమా పరిశ్రమలోకెల్లా ఆసక్తికరమైన కాంబినేషన్ లలో ఒకటి మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన మొదటి సినిమా అతడుకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం ఇప్పటికి టీవీలలో ప్రేక్షకులతో రిపీట్ షోలు వేయించుకుంటుంది. ఇక 2010లో వచ్చిన ఖలేజా బాక్స్ ఆఫీసు వద్ద నిరాశ పరిచినా మహేష్ నటనకు, క్యారెక్టర్ కు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు.
మహేష్ – త్రివిక్రమ్ కలిసి సినిమా చేసి పదేళ్లు పైనే అయిపొయింది. వాస్తవానికి 2016 లోనే వీరిద్దరి మూడో సినిమా రావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. మళ్ళీ ఇన్నేళ్లకి ఈ కాంబోలో సినిమా అనౌన్స్ చేయటం జరిగింది.హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ లీలా మరో హీరోయిన్ గా నటిస్తుందంటూ ప్రచారం జరిగినా అధికారికంగా ప్రకటన ఏదీ రాలేదు.అలాగే సినిమాలో మరో ముఖ్యమైన పాత్రకు మలయాళ నటుడు పృథ్వీరాజ్ తో సహా పలు పర భాషా నటుల పేర్లు వినిపించాయి వాటికి యే రుజువు లేదు.
అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇటీవలే మహేష్ కు త్రివిక్రమ్ ఫుల్ స్క్రిప్ట్ నేరెట్ చేసారు అని, దానికి మహేష్ కొన్ని మార్పులు సూచించినట్టు తెలుస్తుంది. ఆయా మార్పులు అన్నీ తొందరగా కానిచ్చి, ఆగస్ట్ లో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో త్రివిక్రమ్ టీమ్ ఉన్నట్టు తెలుస్తుంది. ముచ్చటగా మూడోసారి కలవనున్న ఈ మాటల మాంత్రికుడు మరియు సూపర్స్టార్ కలిసి ప్రేక్షకులకి అతి పెద్ద బ్లాక్ బస్టర్ అందిస్తారని ఆశిద్దాం.