దర్శకుడు/రచయిత త్రివిక్రమ్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమాలు, పవన్ కళ్యాణ్ సినిమాల్లో జోక్యం చేసుకోవడం పై సూపర్ స్టార్ మహేష్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్రివిక్రమ్ SSMB28 పై దృష్టి పెట్టే బదులు, ఇతర సినిమాలకు సంభందించిన అనవసర పనుల్లో నిమగ్నమైనందుకు వారు ఏమాత్రం సంతోషంగా లేరు.
ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికీ బాగా తెలుసు. ఇక ఈరోజు పవన్ కళ్యాణ్ సముద్రఖనితో కొత్త చిత్రాన్ని ప్రారంభించారు, ఇందులో యువ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటించనున్నారు. త్రివిక్రమ్ కూడా ఈ చిత్ర యూనిట్ లో చేరారు మరియు ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే మరియు డైలాగ్స్ పై పని చేస్తారు. ఈ భారీ చిత్రంలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలుగా కనిపించనున్నారు. జీ స్టూడియోతో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ ఎస్ స్వరాలు సమకూరుస్తున్నారు.
మరో వైపు, త్రివిక్రమ్ – మహేష్ బాబుల చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందుతుంది, మరియు ఇది మహేష్ అభిమానుల నుండి మాత్రమే కాకుండా తటస్థ ప్రేక్షకులలో కూడా చాలా అంచనాలను కలిగి ఉంది. కాబట్టి త్రివిక్రమ్ 100% ఫోకస్ మహేష్ బాబు సినిమా పైనే పెట్టాలని మహేష్ అభిమానులు కోరుకుంటున్నారు, అంతే కానీ మరే ఇతర సినిమా కోసమో పని చేయడం వారికి ఇష్టం లేదు.
నిజానికి SSMB28 స్క్రిప్టింగ్ దశలోనే ఏదైనా తప్పు జరిగితే సినిమాకు భారీ ఖర్చులు ఉండడంతో సినిమా బాక్సాఫీస్ బాంబ్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ విషయంలో మహేష్ అభిమానుల నిరుత్సాహాన్ని అర్థం చేసుకోవచ్చు.
త్రివిక్రమ్ ఇలా పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబుల సినిమాని ఒకే పాయింట్/పీరియడ్ లో పని చేయడం ఇది మొదటి సందర్భం కాదు. 2010లో, ఆయన మహేష్‌తో కలిసి ఖలేజా కోసం దర్శకుడిగా పనిచేశారు మరియు పవన్ కళ్యాణ్ యొక్క తీన్మార్ చిత్రానికి స్క్రీన్ ప్లే రచయితగా కూడా పనిచేశారు. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. ఈసారి కూడా అదే ఫలితం పునరావృతం కాకూడదని, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలు రెండూ సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నాం.