టాలీవుడ్ స్టార్ యాక్టర్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన గుంటూరు కారం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం అందుకున్నారు. దీని అనంతరం త్వరలో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29 చేసేందుకు సిద్ధమవుతున్నారు మహేష్. ఈ మూవీ పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ అందరిలో భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి పట్టాలెక్కనుంది. త్వరలో దీనికి సంబందించి అనౌన్స్ మెంట్ రానుంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ దేవకీ నందన వాసుదేవ. ఈ మూవీకి హను మాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ కథని అందించగా సామినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. తాజాగా టీజర్, సాంగ్స్ తో ఆకట్టుకున్న ఈ మూవీ నవంబర్ 14న ఆడియన్స్ ముందుకి రానుంది.
విషయం ఏమిటంటే, ఈ మూవీ యొక్క క్లైమాక్స్ లో వచ్చే ఒక కీలక సన్నివేశంలో సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీకృష్ణుడి పాత్రలో కొన్ని క్షణాలు కనిపించనున్నారని అంటున్నారు. అయితే ఈ విషయమై మహేష్ నటించనున్నారని వార్తలు వస్తున్నప్పటికీ, ఆయన పాత్రని విఎఫ్ఎక్స్ లో చూపించనున్నారని మరికొందరు అంటున్నారు. అయితే దీని పై దేవకీ నందన వాసుదేవ యూనిట్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. ఇదే కనుక నిజం అయితే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి పెద్ద పండుగే అని చెప్పాలి.