సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో మహేష్ సరసన పూజా హెగ్డే నటించనున్నారు. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఈ చిత్రం (SSMB28) సినిమా ఎప్పుడు మొదలవుతోందా అని ఎదురు చూస్తున్నారు. అయితే వారి ఊహలకు భిన్నంగా వారికి చిన్న కానుక అందించారు మహేష్. వెండితెర పై కాకుండా.. మహేష్ సాధారణంగా ఇంటర్వ్యూలు లేదా ఇతర రియాల్టీ షోలకు చాలా అరుదుగా వస్తుంటారు. అయితే తాజాగా జీ తెలుగు వారు నిర్వహిస్తున్న డాన్స్ రియాల్టీ షోలో తన కూతురు సీతారతో కలిసి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
మహేష్ – సితార కలిసి తొలిసారిగా టీవీ షోలో కనిపించడంతో పాటు డాన్స్ ఇండియా డాన్స్ ప్రోగ్రాం లోని యాంకర్లు, న్యాయనిర్ణేతలు మరియు పోటీదారులు కలిసి చేసిన సందడిని ప్రేక్షకులు ఈ ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ ప్రోగ్రాంలో చూసి ఆనందించవచ్చు. అంతే కాకుండా ఈ ప్రోగ్రాంలో సితార డాన్స్ పెర్ఫార్మెన్స్ మరియు తనదైన శైలిలో జరిపిన సంభాషణలు మరో ఆకర్షణగా చెప్పుకోవచ్చు.
ఈ సందర్భంగా పోటీలను జెండా ఊపి ప్రారంభించిన అనంతరం నటుడు మహేశ్‌బాబు మాట్లాడుతూ.. “సితారకు డ్యాన్స్ పై ఉన్న మక్కువ మమ్మల్ని డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ తెలుగు వద్దకు వచ్చేలా చేసింది. నా కుమార్తెతో వేదికపై ఉండటం చాలా ఉత్సాహంగా మరియు ఆనందంగా ఉంది అన్నారు. అలాగే ఇప్పటికే ఈ కార్యక్రమం వివిధ భాషలలో ఒక సంచలనం సృష్టించింది. ఆ కోవలోనే తెలుగు వెర్షన్ కొరకు జీ తెలుగు మరియు డాన్స్ ఇండియా డాన్స్ టీమ్ మారుమూల ప్రాంతాలనుండి భిన్న నేపథ్యాలు గల ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకురావడం నాకు సంతోషంగా ఉంది” అన్నారు.
ఇక సితార కూడా ఈ కార్యక్రమానికి రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. “మొదటి సారి నేను వేదికపై నేను, నా పక్కన నాన్న ఉండటం చాలా ప్రత్యేకమైన క్షణం. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం & డాన్స్ ఇండియా డాన్స్ ప్రోగ్రాంలో పాల్గొనబోతున్న అద్భుతమైన ప్రతిభ గల పోటీదారుల ప్రదర్శన చూడటం చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళ ప్రదర్శన నాకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. నేను చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. అది ప్రతి ఒక్కరూ చూసే వరకు నేను వెయిట్ చేయలేను. నన్ను డాన్స్ ఇండియా డాన్స్ తెలుగులోకి తీసుకెళ్లినందుకు నాన్నకు కృతజ్ఞతలు చెప్పాలి” అన్నారు.
ఈ సందర్భంగా జీ తెలుగు చీఫ్ కంటెంట్ ఆఫీసర్ అనురాధ గూడూరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు హీరో మహేష్ బాబుకు ధన్యవాదాలు తెలుపుతూ.. “డాన్స్ ఇండియా డ్యాన్స్ తెలుగు పోటీకి సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు ఆయన కూతురు సితార విచ్చేయడం మా అదృష్టం. ఇటీవలి కాలంలో ఏ టెలివిజన్ షోల భారీ లాంచ్‌లలో అయినా ఈ షో ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. డాన్స్ ఇండియా డాన్స్ తెలుగులో పోటీదారులు ప్రతిభ అపారమైనది. ప్రతి వారం వారు ఇచ్చే అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ షో ప్రదర్శన కొనసాగుతుందని మేము విశ్వసిస్తున్నాము. మహేష్ బాబు, సితార మొదటిసారి టీవీలో కలిసి కనిపించడం మా షోకు లభించిన భారీ ప్రోత్సాహం. అంతే కాకుండా, వారిని చూడటం అభిమానులకు మరియు వీక్షకులు పెద్ద సంబరంలా జరుపుకుంటారు ” అన్నారు.