రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు మొత్తం నలుగురు సభ్యులను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. అయితే ఆ నలుగురిలో ఇద్దరు తెలుగు చలన చిత్రసీమకు చెందిన ప్రముఖులు కావడం పట్ల ఇండస్ట్రీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తంగా ఆ నలుగురు దక్షిణాది వారు కావడం మరింత విశేషంగా చెప్పుకోవాలి. పిటి ఉష, వీరేంద్ర హెగ్డే, విజయేంద్ర ప్రసాద్, ఇళయరాజా లను కొద్దిసేపటి క్రితం కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం, వారిలో ఇద్దరు చిత్రసీమ నుండి ఉండడంతో పలువురు సినిమా ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు, తమిళ భాషలల్లోనే కాక ఇతర భాషల్లో ఎన్నో వేల పాటలు కంపోజ్ చేసిన దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన పాటలు ఇష్టపడని వారు ఉండరు అంటే అది ఎంత మాత్రం అతిశయోక్తి కానే కాదు. ఇక రాజమౌళి తండ్రి వి.విజయేంద్రప్రసాద్ కూడా తెలుగు సహా ఇతర భాషల ప్రేక్షకులకు సుపరిచితమే. రాజమౌళి తీసే ప్రతి సినిమాకి కథ అందించే విజయేంద్ర ప్రసాద్, ఇటీవల బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన భజరంగి భాయీజాన్ సినిమాకి, అలాగే తమిళ అగ్ర హీరో విజయ్ నటించిన మెర్సల్ చిత్రానికి కథను అందించారు.
ఇక పరుగుల రాణి గా తన అద్భుత ప్రతిభతో ఎన్నో పతకాలు గెలుచుకున్న పిటి ఉష గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.వీరితో పాటు కర్ణాటక కి చెందిన సమాజ సేవకుడు వీరేంద్ర హెగ్డే విద్య, ఆరోగ్యం విషయంలో ఎంతో కృషి చేస్తున్నారు. కర్ణాటకలో ఆయనకు ఎంతో గొప్ప పేరుంది. ఈ నలుగురిని రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేయడం ఎంతో గర్వంగా ఉందని, ఒక్కొక్కరి గురించి భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వయానా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో వారి ప్రతిభని పొగుడుతూ పోస్ట్ చేయటం జరిగింది.