పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడి స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, అనన్య పాండే హీరోయిన్ హా నటించిన లైగర్ ఇటీవల విడుదలై ఎవరూ ఊహించని విధంగా, భారీ డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆగస్టు 25, 2022న ఈ చిత్రం విడుదలైంది.
రిలీజ్ కు ముందు ప్రచారంలో భాగంగా హీరో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా 200 కోట్లకు పైగా వసూళ్లని రాబడుతుందని భారీ స్టేట్మెంట్ ఇవ్వడం, అలాగే పూరి – ఛార్మీ ద్వయం ఈ సినిమాని విపరీతంగా ప్రమోట్ చేయడం, వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక అతిథి పాత్రలో నటిస్తున్నారు అని చెప్పడం ఇలా అన్ని కలిసి సినిమాకి ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు నెలకొనేలా చేశాయి. అయితే చిత్ర బృందం ఆశించినట్లుగా ఈ సినిమా ఆడలేదు సరికదా అసలు ఏమాత్రం ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచి భారీ షాకిచ్చింది. విడుదలకు ముందు సినిమాకు భారీ హంగామా చేయడం వల్ల లైగర్ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో బాగా ఉపయోగపడింది. ఇక ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుపుకుంది. అయితే సినిమాకు తొలి రోజే డిజాస్టర్ టాక్ రావడంతో ఒక్కసారిగా బాక్స్ ఆఫీస్ వద్ద కుప్పకూలింది.
దాంతో ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించాలనే లక్ష్యంతో ఉన్న విజయ్ దేవరకొండకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేవలం తొలి రోజు మినహా ఈ సినిమాకి థియేటర్ల వద్ద కలెక్షన్లు రానే లేదు. హిందీలో పరవాలేదు అనిపించినా దారుణమైన టాక్ అక్కడ కూడా ఈ చిత్రం సేఫ్ అనిపించుకోలేకపోయింది. ఇక జరిగిన బిజినెస్ కి వచ్చిన కలెక్షన్లకి ఏమాత్రం పొంతనే లేదు. మొత్తంగా లైగర్ సినిమా పంపిణీదారులు 60 శాతానికి పైగా నష్టపోయారు.
ఇక తాజాగా లైగర్ సినిమా OTT ప్రీమియర్ విడుదల ఖరారైంది. సెప్టెంబర్ 30, 2022 నుండి డిస్నీ+ హాట్‌స్టార్‌లో లైగర్ చిత్రం స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంటుంది. లోగుట్టు నివేదికల ప్రకారం, ఈ సినిమా థియేటర్‌లలోకి రావడానికి ముందే నిర్మాతలు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ తో డిజిటల్ హక్కులకు సంభందించిన ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా డిస్నీ+ హాట్‌స్టార్ ఈ సినిమా హక్కులను పొందడానికి భారీ మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చిందని సమాచారం.
లైగర్ సినిమాని తెరకెక్కించింది పూరి జగన్నాధ్ లాంటి ఒక స్టార్ డైరక్టర్, మరియు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో ఉన్నప్పటికీ, ఈ స్టార్ పవర్ సినిమాకు బాక్సాఫీస్ కలెక్షన్లలో పెద్దగా ఉపయోగ పడలేదు. మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్ చూసిన తర్వాత, క్రమంగా వసూళ్లు తగ్గడం ప్రారంభించాయి. విజయ్ దేవరకొండ ఎంత కష్టపడినా వృధా అయింది.