తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడు పూరి జగన్నాథ్ ది ప్రత్యేకమైన స్థానం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరు హీరోలూ హిట్ కోసం అందరూ ఆయన దగ్గరకే వెళ్తుంటారు. ఒకప్పుడు ఉన్న ఫామ్ లేకపోయినా.. ఇప్పటికీ అటు ప్రేక్షకుల్లో ఇటు ఇండస్ట్రీ వర్గాలలో పూరి ఇమేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు అనే చెప్పాలి. ప్రస్తుతం స్టార్ హీరోలుగా రాజ్యం ఏలుతున్న చాలా మంది హీరోలకు ఆయన కెరీర్ ను మార్చేసే సినిమాలను అందించారు. మహేష్ బాబు పోకిరి కావచ్చు లేదా జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ కావచ్చు, అల్లు అర్జున్ దేశముదురు ఇలా ఆయా హీరోల కెరీర్ ను మలుపు తిప్పిన సినిమాలుగా నిలిచాయి.
మరో ఆసక్తికరనైన విషయం ఏమిటంటే పూరి జగన్నాధ్ తన సినిమాలను ఎప్పుడూ చాలా రీజనబుల్ బడ్జెట్‌తో తెరకెక్కిస్తారు. స్టార్ హీరోతో సినిమా చేసినప్పటికీ, ఆయన సినిమా బడ్జెట్‌ను ఎంతో ప్రణాళికా బద్ధంగా ఖర్చు పెడతారు. అంతే కాకుండా నిర్మాతలకు ఎక్కువ ఇబ్బంది కలగకుండా వ్యవహరిస్తారు. అందువల్లే నిర్మాతలు కూడా ఆయనతో సినిమా తీసేందుకు ఎప్పుడూ ముందుంటారు.
అయితే లైగర్ తో పూరీ మొదటిసారిగా తన పద్ధతికి విరుద్ధంగా ప్రవర్తించారు. పూరి జగన్నాథ్ కెరీర్ లోనే ఎక్కువ రోజుల పాటు షూటింగ్ జరుపుకున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. మొత్తం సినిమా షూటింగ్ ను పూర్తి చేయడానికి చాలా సమయాన్ని వెచ్చించారు పూరి. దీని కారణంగా, సినిమా బడ్జెట్ వడ్డీలతో కలిపి సుమారు 100 కోట్లకు చేరుకుందని అంటున్నారు.
అందువల్లే లైగర్ చిత్రానికి ఇప్పటి వరకు భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ఆ సినిమాకి సంభందించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎంతో ఘనంగా జరిగింది. సినిమా వచ్చిన తీరుతో, అలాగే ప్రి రిలీజ్ బిజినెస్ తో కూడా చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉంది, ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు 100 కోట్లకు జరుపుకుంది. అంతే కాక సినిమాకు ప్రేక్షకుల్లో మంచి బజ్ కూడా నెలకొంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే, ఇది విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా నిలుస్తుంది.
లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా అనన్య పాండే, తల్లి పాత్రలో రమ్య కృష్ణ, బాక్సింగ్ కోచ్ గా రోనిత్ రాయ్ మరియు ప్రఖ్యాత బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా ఒక అతిధి పాత్రలో నటించారు. కరణ్ జోహార్ తన ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు