విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం లైగర్ గత కొద్ది రోజుల నుంచి తప్పుడు కారణాల వల్ల టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. ఆగస్ట్ 25 న ఈ సినిమా విడుదలైనప్పటి నుండి, లైగర్ సినిమా దారుణమైన ట్రోలింగ్ కు గురైంది. ఈ చిత్రం ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్లా దారుణమైన కలెక్షన్లను నమోదు చేసింది. ఇక ఇప్పుడు ఆ నష్టాలను పూడ్చుకోవాల్సిన పరిస్థితి చిత్ర యూనిట్ పై నెలకొంది.
లైగర్ సినిమా బిజినెస్ తూర్పు గోదావరి ప్రాంతం మినహా మిగిలిన అన్ని ఏరియాలలోనూ రికవరీ ప్రాతిపదికన జరుపుకుంది. తూర్పు గోదావరి వ్యాపారం మాత్రమే ఎన్నారై అంటే నాన్ రిఫండబుల్ ప్రాతిపదికన జరిగింది. లైగర్ సినిమాకు సంబందించి సౌత్ ఇండియా రైట్స్ మొత్తం కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను.. ప్రస్తుతం లైగర్ సినిమా వల్ల చాలా నష్టపోయారు.
వరంగల్ శ్రీను డిస్ట్రిబ్యూటర్ గా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 20 కోట్లు పరిహారం ఇవ్వాల్సి ఉంది, కానీ ఆయన ప్రస్తుతం అంత డబ్బుని ఇచ్చే పరిస్థితుల్లో లేరు. ఇప్పటికే ఆచార్య, విరాట పర్వం వంటి సినిమాల వల్ల భారీ నష్టాలు ఎదుర్కొంటున్న తరుణంలో, ఇప్పుడు లైగర్ రూపంలో మరిన్ని తీవ్ర నష్టాలను చవిచూశారు.
పూరి జగన్నాథ్ మరియు ఛార్మీ కౌర్ కూడా ఈ నష్టాలను భర్తీ చేయాల్సి ఉంది. ఎందుకంటే వరంగల్ శ్రీను ఎంత వరకు ఈ భారాన్ని మోస్తారో చూడాలి. కొంత పరిహారం వరంగల్ శ్రీను, మరి కొంత పరిహారం ఛార్మీ కౌర్ కూడా నష్టాలను భర్తీ చేయాలని చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు ఎదురుచూపులతో ఉన్నారు. ఎందుకంటే మొత్తం వ్యవహారం ఒకేసారి సెటిల్ చేయాలని.. మునుపటి లాగా ఒక సినిమా నష్టాలను మరో సినిమా ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఆ సినిమాల లాభాల కోసం వేచి ఉండకూడదని వారు అనుకుంటున్నారు.
మరి డిస్ట్రిబ్యూటర్ల బాధలోనూ న్యాయం ఉంది కదా. ఎందుకంటే ఏ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందా లేదా ఫ్లాప్ అవుతుందా అని ఎవరూ ఊహించలేరు. అందుకని ఏ సినిమాకి సంభందించిన సెటిల్మెంట్ ఆ సినిమాతో చేసుకోవడం మంచిదే. మరి డిస్ట్రిబ్యూటర్ల ఆశలు నెరవేరుతాయా లేదా చూడాలి.