ఈమధ్య కాలంలో చాలా మంది బాలీవుడ్ తారలు దక్షిణాదికి వెళ్లడం ప్రారంభించినందున, శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ కూడా ఎన్టీఆర్ 30 సినిమాతో దక్షిణాదిలో అరంగేట్రం చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదే విషయమై గతంలో పలు రకాల పుకార్లు కూడా వచ్చాయి.
ఎన్టీఆర్ 30 సినిమాకు సైన్ చేశారా ఒక మీడియా ఇంటర్వ్యూలో జాన్వీని ప్రశ్నించగా తాను ఎన్టీఆర్ తో కలిసి నటించడానికి ఇష్టపడతానని జాన్వీ తెలిపారు. అయితే ఆ సమయంలో అడిగిన ప్రశ్నకు అవుననీ లేదా కాదనీ ఏ విధమైన సమాధానం ఆమె ఇవ్వలేదు.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ 30 సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా కోసం ఆమె రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.
ఇక ఈ సినిమాని పాన్ ఇండియా ఇమేజ్ పొందడానికి భారీగా సహాయపడే విధంగా అన్ని పరిశ్రమల నుండి సహాయ పాత్రలకు నటీనటులను తీసుకోవాలని చిత్ర బృందం యోచిస్తోన్నట్లు తెలుస్తోంది.
జాన్వీ కపూర్ టాలీవుడ్ లో అరంగేట్రం చేయాలని చాలా సంవత్సరాలుగా ప్రణాళికలో ఉన్నారు, కానీ వివిధ కారణాల వల్ల ఆ ప్రణాళికలు కాస్త ఆలస్యమయ్యాయి. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రం 2024 ఏప్రిల్ 5 న విడుదల కానుంది.ఈ విషయాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ తన అధికారిక ట్విట్టర్ పేజ్ ద్వారా నిన్న ఉదయం తెలియజేసింది. యువసుధ ఆర్ట్స్ పతాకం పై సుధాకర్ మిక్కిలినేని, హరికృష్ణ కె ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
కాగా ఈ సినిమాకి ఆర్ రత్నవేలును డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్ గా నియమించారు. ఈ చిత్రానికి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా పనిచేయనుండగా, అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.