ప్రస్తుత కాలంలో సినిమా పరిశ్రమలో ఓటీటీల హావా బాగా పెరిగిపోయిన విషయం తెలిసిందే.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి సినిమా రిలీజ్ అయిన కొద్దిరోజులకే ఓటీటీల్లో సినిమాలు విడుదల అవుతున్నాయి. అయితే దాంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతుందని నిర్మాతలు వాపోతున్న విషయం కూడా తెలిసిందే.
ఇదిలా ఉండగా సినిమా రిలీజ్ అయిన రెండు, మూడు వారాలకు ఓటీటీలో సినిమా రావడంతో నిర్మాతలకు నష్టం వాటిల్లుతుందని కొందరు నిర్మాతలు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ సమస్య కేవలం తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. స్టార్ హీరోల సినిమాలు సైతం నేరుగా ఓటీటీలోనే విడుదల అవడం గమనార్హం.
అందులో స్టార్ హీరో అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లాంటి హీరోల సినిమాలు కూడా ఓటీటీల్లో విడుదల అవడం జరిగింది. అయితే వాటిల్లో కొన్ని సినిమాలకు థియేటర్లతో పోల్చుకుంటే ఓటీటీల్లోనే కొన్ని సినిమాలకు ఆదరణ దక్కుతోంది. అయితే తన సినిమాలకు మాత్రం ఆ పరిస్థితి రానివ్వను అని బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ అన్నారు.
అమీర్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’. ఇక ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్- కిరణ్ రావు – వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మించాయి. లాల్ సింగ్ చడ్డా చిత్రం ఈ ఏడాది ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు- తమిళం – హిందీలో విడుదల కానుంది. కాగా ఈ సినిమాలో అక్కినేని వారసుడు నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇక పోతే ఈ సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఆరు నెలల తర్వాతనే ఓటీటీలో విడుదల చేస్తామని అమీర్ ఖాన్ ప్రకటించారు. తక్కువ సమయంలో డబ్బు వస్తుంది కదా అని తొందరగా ఓటీటీలో విడుదల చేస్తే ఆ తరువాత ప్రేక్షకులని మనం థియేటర్లకు రప్పించలేము అని అమీర్ అభిప్రాయ పడ్డారు. కాగా ఈ సినిమాను ఇండియన్, జపాన్, చైనా అన్ని భాషల్లో రిలీజ్ చేసే ఆలోచనలో కూడా ఉన్నారట అమీర్. ఆయన ప్రకటన మేరకు 6 నెలల వరకు సినిమా ఓటీటీకి రాదు కాబట్టి ప్రేక్షకులు ఖచ్చితంగా థియేటర్ల లోనే సినిమా చూడాల్సి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమా విజయం పై అమీర్ ఖాన్ చాలా ధీమాగా ఉన్నారు. ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని అమీర్ ఖాన్, చిత్ర యూనిట్ బలంగా నమ్ముతున్నారు. మరి వారి అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.