బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటిస్తోన్న తాజా సినిమా లాల్ సింగ్ చడ్డా. విలక్షణమైన పాత్రలతో, కథలతో వచ్చే అమీర్ ఖాన్ నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. కెరీర్ మొదటి నుంచీ అమీర్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ విజయాలను అందుకుంటున్నారు. ఆయన హీరోగా నటించిన దంగల్ (2016) విడుదలయి ఆరేళ్లు అవుతుంది. అంత గ్యాప్ తరువాత ఆయన చేస్తున్న సినిమా లాల్ సింగ్ చడ్డా.
ఈ సినిమాలో అమీర్ సరసన కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. భారీ విజయం సాధించిన 3 ఇడియట్స్ సినిమా తర్వాత ఈ జంట మరోసారి కలిసి నటిస్తున్నారు. దాంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. అదే విధంగా ఈ సినిమాలో అక్కినేని యువసామ్రాట్ నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. లాల్ సింగ్ చడ్డా స్నేహితుడు బాలరాజు పాత్రలో నాగ చైతన్య కనిపించనున్నారు.
ఈ క్రమంలో సినిమా తెలుగు ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ట్రైలర్ లాంచ్ చేసిన అనంతరం చిరంజీవి, అమీర్ ఖాన్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా అమీర్ మాట్లాడుతూ.. తను చిరంజీవి దగ్గర నుండి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాను అన్నారు. అలాగే అవకాశం వస్తే తప్పకుండా చిరంజీవి గారితో నటిస్తానని చెప్పారు. ఆ సమయంలోనే గాడ్ ఫాదర్ సినిమాలో నన్ను అడగకుండా సల్మాన్ తో నటింపజేశారు అని అమీర్ చిరంజీవిని చమత్కారంగా అడిగారు.
ఇక చిరంజీవి మాట్లాడుతూ, అమీర్ ఎపుడూ విభిన్నమైన పాత్రలను మరియు సినిమాలను అందించి ప్రేక్షకులని మెప్పిస్తారని, అదే తాను అయితే ప్రేక్షకులు ఏ పాత్రల్లో తనను చూడటానికి ఇష్టపడతారో అవే చేస్తుంటానని, అయితే కొన్నిసార్లు తనకి తెలియకుండానే కొన్ని జరిగి పోతాయని, వాటి గురించి మాట్లాడదల్చుకొలేదని చిరంజీవి అన్నారు. అయితే ఆయన పరోక్షంగా ఆచార్య సినిమా గురించే అలా అన్నారని ఆ విడియో చూసిన సోషల్ మీడియాలో వీక్షకులు అంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన “ఆచార్య” భారీ పరాజయం చవి చూసిన సంగతి తెలిసిందే. ఇక ఇదే క్రమంలో చిరంజీవి సినిమా పరిశ్రమలో దర్శకులని ఉద్దేశిస్తూ కొన్ని సూచనలు ఇచ్చారు. దర్శకులు ముందుగానే డైలాగులు మరియు స్క్రిప్ట్ రాసుకుని వస్తే మంచిదని, అలా కాకుండా సెట్స్ మీదకి వచ్చిన తరువాత రాస్తే అంతగా మంచిది కాదని ఆయన అభిప్రాయ పడ్డారు.
లాల్ సింగ్ చడ్డా చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్- కిరణ్ రావు – జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే (వయాకామ్ 18 స్టూడియోస్) నిర్మించారు. ఈ ఏడాది ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు-తమిళం-హిందీలో ఈ చిత్రం ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. హాలీవుడ్ హిట్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. వయాకామ్ 18 స్టూడియోస్ తో కలిసి మెగాస్టార్ చిరంజీవి తెలుగులో ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.