తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుల్లో కృష్ణవంశీ ఒకరు. తొలి సినిమా గులాబి తోనే ఇండస్ట్రీ దృష్టితో పాటు ప్రేక్షకుల ఆదరణ పొందిన ఆయన ఆ తరువాత విలక్షణమైన పద్ధతిలో సినిమాలు తీసి అందరినీ మెప్పించారు.
నిన్నే పెళ్లాడుతా లాంటి ఎవర్ గ్రీన్ సినిమాను అందించిన తరువాత, సిందూరం, అంతఃపురం వంటి సినిమాల్లో సామాజిక అంశాలను, సమస్యలను చర్చించి శభాష్ అనిపించుకున్న ఆయన ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో తీసిన “మురారి” అద్భుతమైన స్పందనను, క్లాసిక్ స్టేటస్ ను సంపాదించుకుంది. ఆ తరువాత ఖడ్గం,రాఖీ వంటి సినిమాలు విజయం సాధించినా క్రమక్రమంగా ఆయన సినిమాలపై పట్టు కోల్పోతూ వచ్చారు.
అడపాదడపా సినిమాలు తీసినా ఏవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. 2017 లో వచ్చిన “నక్షత్రం” ఆయన చివరి సినిమా.ఆ తరువాత కొంత కాలం విరామం తరువాత ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో “రంగ మార్తాండ” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.గతంలోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఈ సినిమా మరాఠి క్లాసిక్ ‘నట్‌సామ్రాట్’ చిత్రానికి రీమేక్ గా రూపొందించబడింది.
ఇదిలా ఉండగా కృష్ణవంశీ OTT లోకి ప్రవేశిస్తున్నారు అనే వార్తలు ఇటీవల బాగా ప్రచారంలోకి వచ్చాయి. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో ఆ ప్రాజెక్ట్ తెరకెక్కనుందని సమాచారం. అయితే వీటిని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉండగా,తాజాగా కృష్ణవంశీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తన తదుపరి తీయబోయే సినిమాకి సంభందించి ఒక వీడియోను విడుదల చేసారు.
ఇన్నేళ్లుగా ఆయన సినిమాలను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ మరో భావోద్వేగమైన కధతో మీ ముందుకు వస్తున్నా అంటూ ఆ వీడియో ముగించారు.ఇక ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.