ఎన్టీఆర్ 30వ సినిమాకి కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయం సాధించడం కొరటాలకు ఎంతగానో అవసరం. అయన చివరిగా మెగాస్టార్ చిరంజీవిని ప్రధాన పాత్రలో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను ముఖ్య పాత్రలో నటింపజేసిన ఆచార్య సినిమా భారీ పరాజయం పాలయింది. దాంతో ఆయన ఆశలన్నీ తర్వాత చేయబోయే ఈ ప్రాజెక్ట్ పైనే ఉన్నాయి.
ఇక RRR వంటి ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించిన జోరును కొనసాగించడానికి ఎన్టీఆర్ కూడా ఈ సినిమా మీద చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకోసం కొరటాల ప్రాజెక్ట్‌లో అనేక మార్పులు చేస్తున్నారు. కొరటాల శివ పరిస్థితి ఒక్క డిజాస్టర్ సినిమాతో పూర్తిగా మారిపోయింది. ఆచార్య కంటే ముందు అయన అటు ఆర్థికంగా, ఇటు కెరీర్ పరంగా గొప్ప స్థానంలోనే ఉన్నారు. కానీ ప్రస్తుతం మాత్రం తదుపరి చిత్రంతో ఒక విజయవంతమైన సినిమా తప్పక ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఆయన పై విపరీతమైన ఒత్తిడి ఉంది.
ఇక హీరో ఎన్టీఆర్ కూడా ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ మార్పులలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. అంతే కాకుండా చర్చలలో భాగంగా స్క్రిప్టులో కొన్ని సార్లు మార్పులు చేర్పులు చేయమని కొరటాలని కోరారు. ఐతే కొరటాల శివ మాత్రం ఎన్టీఆర్‌ని మెప్పించడంలో విఫలమవుతున్నారని తెలుస్తోంది. ఇలా స్క్రిప్ట్ దశలోనే ఇంత సమయం కేటాయించడం వలన ఈ ప్రాజెక్ట్ లో జరుగుతున్న జాప్యం.. పెరుగుతున్న ఖర్చుల గురించి దర్శక నిర్మాతలు అయోమయంలో ఉన్నారట.
కొన్ని నెలల క్రితం విడుదలైన ఎన్టీఆర్ 30 మోషన్ పోస్టర్ ఎన్టీఆర్ అభిమానులకు ఎంతగానో నచ్చింది. కాగా ఆ మోషన్ పోస్టర్ వలన మార్కెట్లో సినిమాకు విపరీతమైన బజ్ కూడా ఏర్పడింది. ఎన్టీఆర్ ఇంటెన్స్ మాడ్యులేషన్ మరియు అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ మోషన్ పోస్టర్ కి హైలైట్ గా నిలిచాయి. కాగా ఎన్టీఆర్ అనిరుధ్ కలిసి పని చేయడం ఇదే మొదటిసారి.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్టు దశలో కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ.. ఈ ప్రాజెక్ట్ పై కొరటాల శివ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇండియన్ సినిమాలో ఇదొక కొత్త జానర్ అవుతుందని చాలా నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా బ్యాక్‌డ్రాప్ పూర్తిగా కొత్తది పైగా ఇంతకు ముందు ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్ గా చెప్తున్నారు. మరి కొరటాల శివ ఏం మాయాజాలం చేయబోతున్నారో చూడాలి.