యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ ఆయనకి గొప్ప ప్రశంసలను అందించింది మరియు మొత్తం మీద ప్రేక్షకుల నుండి పాజిటివ్ రిపోర్ట్‌లను తెచ్చిపెట్టింది. కాగా ఈ చిత్రం ఆయన కెరీర్‌లో అత్యంత విజయవంతమైన సినిమాగా నిలిచింది మరియు కిరణ్ అబ్బవరం ప్రస్తుతం ఈ విజయాన్ని ఆనందిస్తున్నారు.
ఇక ఈ సినిమా సక్సెస్ మీట్‌లో కిరణ్ మాట్లాడుతూ, ప్రేక్షకులు తమ ప్రేమతో ఈ బహుళ-జానర్ చిత్రాన్ని ఆదరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో ఆయన తన విరోధులను, ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రోలర్లకు గట్టి సమాధానం ఇచ్చారు. ఆయన ఇచ్చిన స్పీచ్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
కిరణ్ అబ్బవరం గత ఏడాది కాలంగా అనేక ట్రోల్స్ మరియు సోషల్ మీడియా మీమ్‌లకు గురి అవుతున్నారు. అయితే నిర్మాణాత్మక విమర్శలని తాను స్వాగతిస్తాను కానీ ట్విట్టర్‌లో నాకు ద్వేషపూరిత సందేశాలు పంపడం వల్ల ఎవరికీ సహాయం అందదు అని ఆయన అన్నారు. మరి ఆయన చెప్పిన మాటల్లో కూడా నిజం ఉంది కదా. ఈ మధ్య సోషల్ మీడియాలో అయిన దానికీ కాని దానికీ సినిమా నటుల పై ట్రోల్స్ చేయడం ఎక్కువ అయిపోయింది. అందుకు నటులు ఇలా ప్రతిస్పందిస్తే తప్ప ఇవి ఆగవు.
ఇక వినరో భాగ్యము విష్ణు కథ సినిమాకి వస్తే ఈ శనివారం విడుదలైన ఈ సినిమా మొదటి వారాంతంలో అద్భుతమైన విజయాన్ని సాధించింది. మొత్తం ఆంధ్ర, తెలంగాణ గ్రాస్ కలెక్షన్స్ రూ.4.66 కోట్లు కాగా, వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.5.2 కోట్లు ఉంటుంది. కాగా సాధారణ రోజుల్లో కూడా ఈ సినిమా మంచి ఆక్యుపెన్సీస్ నమోదు చేస్తోంది.
కష్మిరా పరదేశి, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. డేనియల్ విశ్వాస్ ఛాయాగ్రహణం, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా.. చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.