ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు కన్నడ స్టార్ హీరో సుదీప్. కన్నడ అభిమానులు ఆయనను ముద్దుగా కిచ్చా సుదీప్ అని పిలుచుకుంటారు. ఈగ సినిమాలో నెగెటివ్ పాత్రలో నటించి మెప్పించిన సుదీప్ ఆ తర్వాత బాహుబలి, సైరా సినిమాల్లోనూ నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు.
ఈ స్టార్ హీరో ఇప్పుడు పాన్ ఇండియా చిత్రంతో మన ముందుకు వస్తున్నాడు. అదే “విక్రాంత్ రోనా” అనూప్ భండారీ దర్శకత్వం వహిస్తోన్న ఈ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌లో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సుదీప్‌తో స్ర్కీన్ షేర్ చేసుకోనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు దర్శక నిర్మాతలు. జూలై 28న కన్నడతో సహా మొత్తం నాలుగు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.ఉగాదికి విడుదలైన ఈ చిత్రం తాలూకు టీజర్ అద్భుతమైన స్పందనను రాబట్టింది
ఇక ఈరోజు విడుదల అయిన ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచే విధంగా ఉంది. తెలుగు ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేయగా,హిందీ వెర్షన్ ను సల్మాన్ ఖాన్, మలయాళ వెర్షన్ ను దుల్కర్ సల్మాన్ విడుదల చేశారు.ఊహజనితనమైన ఒక ఊరిలో ఒక రహస్యం, ఆ రహస్యాన్ని ఛేదించేందుకు ధైర్యంగా ముందుకు వచ్చే పాత్రలో కిచ్చ సుదీప్ లుక్ ఆకట్టుకొగా, కళ్ళు చెదిరే యాక్షన్ సీన్ లతో పాటు అడవి నేపథ్యంలో ఉత్కంఠభరితమైన చేజ్ సన్నివేశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది ట్రైలర్ చూస్తే.
ఇలాంటి కాన్సెప్ట్ అయితే భాషలకు అతీతంగా ప్రేక్షకులు ఆసక్తి చూపుతారు, ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ అయ్యే అన్ని అవకాశాలు ఉన్నాయి “విక్రాంత్ రోనా”లో.ఈ చిత్రానికి నిర్మాతలు జాన్ మంజునాథ్, శాలిని మంజునాథ్. సుదీప్ కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అజనీశ్ లోక్‌నాథ్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు.