కొద్దిరోజులుగా సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న పలువురు ఇన్ ఫ్లుయెన్సర్స్ పై మూడు రోజుల క్రితం పోలీసులు కేసులు ఫైల్ చేసి నోటీసులు అందచేసిన విషయం తెలిసిందే. వారు ప్రమోట్ చేస్తున్న యాప్స్ వలన అనేకమంది ఆకర్షితులై ఎంతో డబ్బు పోగొట్టుకోవడంతో పాటు కొందరు అయితే వాటి కోసం ఎంతో అప్పులు చేసి వాటిని తీర్చలేక ప్రాణాలు కూడా వదిలారని కంప్లైంట్ రావడంతో ఈ కేసులు నమోదయ్యాయి.
కాగా వారిలో ఒకరిద్దరు మాత్రమే పోలీసులు వద్దకు హాజరై వివరణ ఇచ్చారు. నేడు కొద్దిసేపటి క్రితం తనపై నమోదైన కేసు పై విచారణ నిమిత్తం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి విచ్చేసారు విష్ణుప్రియ. కాగా ఈ కేసులో పోలీసులు పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. కేవలం సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్స్ మాత్రమే కాదు అటువంటి యాప్స్ ని ప్రమోట్ చేసిన కొందరు సినీ ప్రముఖుల పై కూడా నేడు కేసులు నమోదు చేసారు.
కాగా నేడు కొద్దిసేపటి క్రితం బాలీవుడ్, టాలీవుడ్ నటులపై కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు. మియాపూర్ పీఎస్‌లో పలువురు బాలీవుడ్ నటులపై ఈ కేసులు నమోదయ్యాయి. మొత్తం 25 మంది నటీనటులపై కేసులు నమోదు అవ్వగా వారిలో దగ్గుబాటి రానా, ప్రకాష్‌రాజ్, మంచులక్ష్మి, విజయ్ దేవరకొండ, నిధి అగర్వాల్, ప్రణీత ఉన్నారు. తప్పనిసరిగా వారందరూ కూడా స్టేషన్ కి వచ్చి వివరణ ఇవ్వాల్సిందే అని, ఈ కేసుల్లో ఏ ఒక్కరినీ వదిలేది లేదని పోలీసులు అంటున్నారు.
మరోవైపు ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా కోట్లాది రూపాయల మేర హవాలా జరుగుతుండడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ కేసు మరి 8ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, ఎవరెవరు ఏవిధంగా వివరలు ఇస్తారో చూడాలి.