గత కొంతకాలంగా తెలుగు సినీ పరిశ్రమలో టికెట్ రేట్లు – ఓటిటి స్ట్రీమింగ్ ల మీద జరుగుతున్న చర్చలు తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొన్ని రోజులు టికెట్ రెట్లు తక్కువ చేయడం, పరిశ్రమ నుంచి పెద్ద హీరోలు,దర్శకులు కలిసి వెళ్లి వాళ్ళ ఇబ్బందులు చెప్పుకున్న తరువాత తిరిగి రేట్లను పెంచుకునే వెసులుబాటు కల్పించింది.
అయితే ముందుగానే చెప్పుకున్నట్టు టికెట్ రేట్ల పెంపు అనేది భారీ బడ్జెట్ చిత్రాలకు సరిపోయినట్టు ఇతర పెద్ద సినిమాలకు లేదా మీడియం బడ్జెట్ సినిమాలకు వర్కౌట్ కాదు అని అనుభవం ద్వారా ఇండస్ట్రీ వర్గాలకు తెలిసి వచ్చింది.
దాంతో మళ్ళీ టికెట్ రెట్లు పాత GO ప్రకారం అంటూ కొత్త ప్రచారం మొదలుపెట్టారు. అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు నిర్మించిన F3 సినిమాకి తెలంగాణలో తక్కువ టికెట్ రేట్లు అంటూ ప్రచారం చేశారు. కానీ ఆ సినిమాకి నిజానికి టికెట్ రేట్లు పెద్దగా తగ్గించలేదు. గత డిసెంబర్ లో తెలంగాణ ప్రభుత్వం అత్యవసర పరిస్థితుల్లో పెంచుకొమ్మన్న రేట్లనే F3 సినిమాకు కేటాయించారు.
ఇక ఆ ప్రచారాన్ని ఈ వారం విడుదల అవబోతున్న పక్కా కమర్షియల్ మరో స్థాయికి తీసుకెళ్లింది. మా సినిమాకి తక్కువ రేట్లు అంటూ ఆ చిత్ర యూనిట్ చేసిన ప్రచారం తొలుత కొంత జనరజంకంగా ఉన్నప్పటికీ, రాను రాను ఒక ప్రహసనంలా తయారయింది మొత్తం వ్యవహారం. ఎందుకంటే ఆ చిత్ర బృందం చేసిన ప్రచారం మేరకు తెలంగాణలో సింగిల్ స్క్రీన్ – 100 బాల్కనీ,మల్టీప్లెక్స్ -150 అంటూ ప్రచారం చేశారు. కానీ బుకింగ్ సైట్ లలో చూస్తే సింగిల్ స్క్రీన్ లకు 150 మల్టిప్లెక్స్ ఒకటి రెండు చోట్ల తప్ప 195/200 కేటాయించబడ్డాయి. నిజానికి ఇవి మీడియం బడ్జెట్ సినిమాలకు మంచి రెట్లే అయినా చిత్ర బృందం ప్రచారం చేసిన రేట్లు లేకపోవడం ప్రేక్షకులను నిరాశ పరిచిన మాట వాస్తవం.
ఇక సినిమా థియేటర్లలో విడుదలైన మూడు,నాలుగు వారాల లోపు ఓటిటిలో వచ్చేయడం కూడా సినిమా థియేట్రికల్ రన్ ను దెబ్బ తీస్తుందని ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం. కరోనా ముందు వరకు ఆరు వారాలు లేదా కనీసం నాలుగు వారాలు గడిచాక ఓటిటిలో వచ్చేవి.
అయితే కరోనా వల్ల భారీగా నష్టాలు చవిచూసే ప్రమాదం వలన కొన్ని సినిమాలు నేరుగా ఓటిటిలో విడుదల అవడం లేదా థియేటర్లలో ఉండగానే ఓటిటి లో విడుదల అవడం ఆనవాయితీగా మారింది. ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాలే అలా తొందరగా ఓటిటి లో విడుదల అవడం ఆ సంస్థకి కొంత చెడ్డ పేరును తీసుకు వచ్చింది. ఆ సంస్థ నిర్మించిన పుష్ప, సర్కారు వారి పాట మూడు వారాలకే ఓటిటిలోకి అందుబాటులోకి వచ్చాయి.
ఇక వచ్చే వారం విడుదలకి సిద్ధం అయిన “హ్యాపీ బర్త్ డే” కూడా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నుంచి వస్తున్నదే. ఆ సినిమాకు కూడా తక్కువ టికెట్ రేట్లు అని ప్రచారం చేశారు. ఇదిలా ఉండగా ఈరోజు చిత్ర ప్రచార నిమిత్తం ప్రెస్ మీట్ పెట్టి ట్రైలర్ విడుదల చేయడం జరిగింది.
ఆ ప్రెస్ మీట్ లోనే విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా నిర్మాత రవిశంకర్ ఇక పై థియేటర్లలో విడుదలైన యాభై (50) రోజులకు కానీ ఓటిటి లో విడుదల అవ్వవు అని చెప్పారు. కరోనా వల్ల నష్టపడ్డ సినిమాలు అన్నీ ఇప్పుడు విడుదల అయిపోయాయి అని,ఆ సినిమాలకే తక్కువ సమయంలో ఓటిటి విడుదల చేసుకునే వెసులుబాటు ఇచ్చామని చెప్తూ ఇక పై అంటే జూలై 1 నుండి విడుదల అయ్యే సినిమాలు మాత్రం ఖచ్చితంగా 50 రోజుల నియమాన్ని పాటించాలని నిర్మాతల మండలి అందరూ కలిసి తీసుకున్న నిర్ణయంగా చెప్పడం జరిగింది.
ఏది ఏమైనా సినిమా కి టికెట్ రేట్లు, ఓటిటి విడుదల అనేవి ప్రచారంలో భాగంగా ఒకసారి మంచిగా మరోసారి చెడ్డగా చెప్పడం ఇండస్ట్రీ వర్గాలు మానేయడం మంచిది. ఒక సినిమా విజయం అనేది ఆయా సినిమాలు చేసే పబ్లిసిటీ వల్ల, లేదా ఆ సినిమాలకు ఉన్న క్రేజ్ పైన ఆధార పడి ఉంటుంది కానీ తక్కువ టికెట్ రేట్లు ఉన్నాయనో లేదా ఓటిటిలో ఆలస్యంగా వస్తుంది అనో కాదు.